- నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా ప్రభుత్వం కట్టివ్వలేదు, ఒక్కో ఇంటికి ఏడున్నర లక్షలు ఖర్చు పెట్టి మూడు ఇళ్ళను లబ్ధిదారులు కట్టుకున్నారు
- మూడు కాలువల బినామీ కాంట్రాక్టుల కోసం పేదల ఇళ్ళు పగలగొట్టిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏ ఒక్కరికైనా ఇల్లు నిర్మించి ఇచ్చారా?
- గత ప్రభుత్వంలో పూర్తైన టిడ్కో గృహాలను కూడా పేదలకు ఇవ్వలేదు
- వైసీపీ రంగుల కాగితాలతో ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ప్రజలకు నాలుక గీక్కునే దానికి కూడా పనికిరావట్లేదు
- ప్రజల ఇళ్ళ నిర్మాణం కోసం ఇచ్చిన మూడు ఆప్షన్లు ఏమయ్యాయి?
- జగనన్న కాలనీలు రాష్ట్రంలోనే అతిపెత్త కుంభకోణం
- వెంకటేశ్వపురం భగత్ సింగ్ కాలనీ వద్ద గల జగనన్న కాలనీని పరిశీలించిన జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణ తీరుపై జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి సోషల్ ఆడిట్ నిర్వహించారు. జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చే గృహాల నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన 180వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం కేవలం అబద్ధాలతోనే కాలం నెట్టుకువస్తోందని అన్నారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే ఏడాది లోపే రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు నిర్మిస్తాం అని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఓ సారి ఉగాదిలోపు అన్నారని, మరోసారి దీపావళి అని, అటుపై క్రిస్ మస్ అని, తర్వాత రంజాన్ లోపు అని, ఇలా తడవకో పండుగ పేరు చెప్తూ కాలం వెళ్లదీస్తూ వచ్చారన్నారు. వైసీపీ రంగుల్లో ఉండే కరపత్రాలు ముద్రించి ఇవిగో ఇళ్ళ పట్టాలు అని అనేకమందికి ఇచ్చారని, ఇప్పుడా పత్రాలు నాలుక గీసుకునే దానికి కూడా పనికి రావట్లేదు అని ఎద్దేవా చేశారు. ప్రజలకు మూడు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం, ప్రజలు ప్రభుత్వమే కట్టివ్వాలి అనే మూడో ఆప్షన్ ఎంచుకుంటే వాలంటీర్ల చేత లబ్ధిదారుల వాటా అనే రెండో ఆప్షన్ పెట్టించి మోసం చేసారని, ఈ విషయం ప్రజలందరికీ అర్థం అయిందని అన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్ళను ఇప్పటికి కూడా పేద లబ్ధిదారులకు ఇవ్వలేదని, పైపెచ్చు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మూడు కాలువలకు గోడ కట్టించే తన బినామీ కాంట్రాక్టు కోసం వందలాది పేదల ఇళ్ళు కూలగొట్టారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఇళ్ళ నిర్మాణాలకు వచ్చే వాటా సొమ్మును కూడా వైసీపీ ప్రభుత్వం తినేసిందని అన్నారు. నేడు వెంకటేశ్వరపురం వద్ద ఉన్న జగనన్న కాలనీలో తాము ఆడిట్ జరిపితే కేవలం మూడు ఇళ్ళు నిర్మించి ఉన్నారని, అవి కూడా లబ్ధిదారులు ఒక్కో ఇంటిని ఏడున్నర లక్షలతో కట్టుకున్నారని, ఆరు గృహాలకు బేసుమట్టం అయిందని, మరికొన్ని పునాదుల దశలో ఉన్నాయని, అనేక ఇళ్ళకి సూచిక చూపే హద్దు రాళ్ళ కూడా లేవని కేతంరెడ్డి వివరించారు. ఇవి జగనన్న కాలనీలు కాదని, జగనన్న మోసాలు అని ప్రజలందరికీ అర్థం అవుతోందని, రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, నెల్లూరు సిటీలో ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com