గుంటూరు ( జనస్వరం ) : మూడు నెలలుగా తాగటానికి గుక్కెడు మంచినీరు దొరక్క గొంతు ఎండుతుంది... ఎమ్మెల్యేకు, కార్పొరేటర్ కు ఎన్నిసార్లు చెప్పినా చేస్తాం చూస్తాం అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే కానీ పరిష్కారం చూపడం లేదు. నగరపాలక సంస్థ అధికారులను కలిసి తమ గోడు వినిపించుకున్నా కనీసం వినతిపత్రం కూడా తీసుకోలేదని కోదండరామయ్య కాలనీ వాసులు జనసేన పార్టీ అర్బన్ అధ్యక్షుడు సురేష్ ముందు తమ గోడుని వినిపించుకున్నారు. మూడు నెలలుగా 21 వ డివిజన్ పరిధిలోని కోదండరామయ్య కాలనీలో మంచినీటి ఎద్దడి నెలకొన్న సందర్భంగా జనసేన పార్టీ నేతలు శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు అసలే ఎండలు మండిపోతున్నాయి ఉక్కపోతతో అల్లాడుతున్నామని . మరోవైపు మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియక నిద్రాహారాలు మాని కూర్చోవలసి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో అర్ధరాత్రి ఒక పది నిముషాలు మాత్రమే వస్తాయని మండిపడ్డారు. అవి కూడా ఒకరి ఇంటికి వస్తే మరొకరి ఇంటికి రావన్నారు. సమస్య గురించి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కార్పొరేటర్ గురవయ్య దృష్టికి తీసుకువెళ్లగా చేద్దాం చూద్దాం అంటూ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటితుడుపు చర్యగా వాటర్ ట్యాంక్ పంపిస్తారని దీనివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదని తమకు శాశ్వత పరిష్కారం కావాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టించుకోవటం మీద ఉన్న శ్రద్ధ మౌళిక సదుపాయాలు కల్పించటంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు పధకాలు వచ్చినా రాకపోయినా పరవాలేదు గుక్కెడు మంచినీరు మాత్రం ఇవ్వండని స్థానికులు పాలకులను, అధికారులను కోరారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ స్పందిస్తూ మంచినీటి సరఫరాలో నెలకొన్న అంతరాయంపై పాలకులపై, అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేని సంక్షేమం దేనికని ప్రశ్నించారు. సంక్షేమం పేరుతో చేస్తున్న లక్షల కోట్ల అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అందరికి తెలుసన్నారు. తాగునీరు లేక స్థానిక ప్రజలు పడుతున్న బాధల్ని పట్టించుకునే నాధుడే లేదని ధ్వజమెత్తారు. వాటర్ డీఈ తో మంచినీటి సమస్యపై మాట్లాడారు. ఆదివారం లోపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఖాళీ బిందెలతో కార్పొరేషన్ ను ప్రజలను కలుపుకొని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కార్యదర్శిలు కొడగంటి రవి, మెహబూబ్ బాషా, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షుడు చెన్నం శ్రీకాంత్, సయ్యద్ షర్ఫుద్దీన్, పవన్ హరి, పఠాన్ షరీఫ్, కగ్గా సాయి, ప్రతాప్, రామకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com