నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 80వ రోజున 40వ డివిజన్ స్థానిక మూలాపేటలోని శివాలయం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మూలాపేటలో నెల్లూరు నగరానికి ఎంతో ముఖ్యమైన, ఎంతో ప్రసిద్ధి చెందిన శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, ధర్మరాజస్వామి ఆలయం వంటి దేవాలయాలు ఉన్నాయన్నారు. ఈ దేవాలయాలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీలతో వివిధ రకాల కైంకర్యాలు, ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉందన్నారు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లను తీసేసి ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. దేవునికి సంబంధించి ఏదైనా కైంకర్యాలు జరపాలంటే ఇప్పుడు ప్రభుత్వం మీద, దాతల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ప్రాంతంలో బ్రాహ్మణులు ఎక్కువుగా నివసిస్తున్నారని, వారి కోసం గతంలో ఉండిన బ్రాహ్మణ కార్పొరేషన్ ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వాపోయారని, అందరి సమస్యలను అధ్యయనం చేశామని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో ప్రతి సమస్య తీరుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.