గుంటూరు ( జనస్వరం ) : వైకాపా పాలనలో మహిళలకు భద్రత కరువైందని, దేశం మొత్తంమీద అడబిడ్డలకు రక్షణ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఎద్దేవా చేశారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రామనామక్షేత్రం వద్దనున్న భరతమాత విగ్రహానికి నీ బిడ్డల్ని నువ్వే రక్షించు తల్లి అంటూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో ముప్పైవేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైన విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పేవరకు అటు పాలకులకు కానీ ఉన్నతాధికారులకు కానీ తెలియకపోవటం శోచనీయమన్నారు. ఇప్పటికీ ఇంకా పదహారు వేలమంది అమ్మాయిల ఆచూకీ తెలియలేదు అంటే మహిళల సంక్షేమం పట్ల జగన్ రెడ్డి చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందని ధ్వజమెత్తారు.ఇంటి నుంచి బయటికి వెళ్లిన అమ్మాయి సమయానికి రాకపోతేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారనన్నారు. అలాంటిది తమ బిడ్డలు అసలు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నివాసమైన తాడేపల్లికి కూతవేటు దూరంలో ఆడపిల్లపై అత్యాచారం జరిగితే నిందితుడిని ఇంతవరకు పట్టుకోలేదు అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. కంటి తుడుపు చర్యగా దిశా చట్టాన్ని తీసుకువచ్చినా అది దశా దిశా లేకుండా పోయిందన్నారు. అసలు రాష్ట్రంలో హోమ్ శాఖ ఒకటి ఉందన్న విషయాన్ని ప్రజలెప్పుడో మరచిపోయారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని ప్రజల్ని కోరారు. ఆడపిల్లలు ఇంటికి, సమాజానికి వెలుగన్నారు. స్త్రీ లేకపోతే సృష్టే లేదన్నారు. ఆకాశంలో సగం అంటూనే వారిపై వివక్ష చూపడం మంచిదికాదన్నారు. ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, కాపాడుకుందామన్నారు. అదే నిజమైన బాలికా దినోత్సవం అంటూ ఆళ్ళ హరి పేర్కొన్నారు. కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, నగర కార్యదర్శి మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, లక్ష్మిశెట్టి నాని, అలా కాసులు, తాడికొండ శ్రీను, చిరంజీవి, టీడీపీ నేతలు గంధం బాబ్జి, పూసల శ్రీను, సుందరరావు, వాసు, బాలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com