- భవిష్య భారత్’ నిర్మాణానికి సమిష్టి కృషి అవసరం మోహన్ భగవత్
విజయవాడ, జనవరి 29, జనస్వరం : రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ఎస్ఎస్) వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో శతాబ్ది సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ జాతీయ చీఫ్ డా. మోహన్ భగవత్ ముఖ్య ఉపన్యాసకులుగా హాజరయ్యారు. ఆయనతో పాటు దక్షిణ భారతదేశ ప్రాంతీయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సంఘ్ ముఖ్య నాయకులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సభకు విశేష ప్రాధాన్యతను అందించారు. మోహన్ భగవత్ ప్రసంగిస్తూ, పంచ ప్రణాళిక విధానం ద్వారా కుటుంబ వ్యవస్థ బలోపేతం, దేశాభివృద్ధి, జాతీయవాదం పటిష్టత లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని తెలిపారు. హిందూ సమ్మేళనాల ద్వారా కోట్లాది ప్రజలను ఏకం చేస్తూ సంఘం దేశవ్యాప్తంగా ముందుకు సాగుతోందన్నారు.
భారతదేశంతో పాటు పలు దేశాలలో ఆర్ఎస్ఎస్ విధానాలపై ఆసక్తి పెరుగుతోందని, స్వచ్ఛందంగా వాటిని తెలుసుకొని అమలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు. నేటి యువత సామాజిక స్పృహతో జాతీయవాదం బలపడేలా ప్రతి భారతీయుడు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
భారతదేశ సాంస్కృతిక సంప్రదాయాలకు కుటుంబ వ్యవస్థే పునాది అని, ఆర్థిక, వాణిజ్య, సైనిక రంగాల్లో భారత్ ప్రపంచంలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి వచ్చిన సంఘ్ ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. భవిష్యత్తులో సంఘ్ నిర్వహించే కార్యక్రమాల్లో మేధావులు, విద్యార్థులను భాగస్వాములుగా చేసుకొని యువతను నాయకత్వానికి సిద్ధం చేయాలని సూచించారు. ప్రాంతీయ స్థాయిలో సంఘం అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ అనంతరం ఈ శతాబ్ది సమావేశం విజయవంతంగా ముగిసింది.