పిఠాపురం, (జనస్వరం) : ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్రం పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కితుంది. ఈ ఘనతలో మహాత్ముడి పాత్ర అనన్యసామాన్యం. అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, భరతమాతకు దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మా గాంధీ. చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, కులమత బేధాలను పటాపంచలు చేశారు. సత్యాగ్రహం, అహింస పాటించడానికి ఎంతో ధైర్యం కావాలని నిరూపించిన సహనశీలి. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం.బాపూజీ చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ.. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. మహోన్నత వ్యక్తిగా అవతరించారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి పాలకులు, ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రపంచదేశాలకే అనుసరణీయం. భారతీయులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముని స్మృతికి నివాళులు అర్పిస్తూ… అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా దేశం కోసం మహోన్నత త్యాగాలను చేసిన దేశ భక్తులందరికీ గౌరవవందనం తెలియజేస్తున్నాను.