కృష్ణాష్టమి — ఈ రోజు శ్రీకృష్ణుని పుట్టినరోజు మాత్రమే కాదు, మనలోని అంతర్యామిని స్మరించే పవిత్ర సందర్భం. ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్న ఒక గొప్ప మాట ఉంది:
“కృష్ణాష్టమి రోజున ‘నేను’ అనే పదానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అర్థాన్ని చదివితే, ఆలోచిస్తే… మీ జీవితమే మారిపోతుంది!” మరి ఆ "నేను" అనే పదం వెనుక దాగి ఉన్న సత్యం ఏమిటి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పిన ఆ ఉపదేశం సారం ఏమిటి?
“నేను” అంటే ఎవరు? :
సంస్కృతంలో “ఆత్మన్” అనే పదం ఉంది. దానికి సమానార్థకంగా తెలుగులో “నన్ను”, “తాను” అని చెప్పవచ్చు. ఆత్మన్ అంటే.. సర్వజీవుల్లో ప్రాణస్వరూపంగా ఉన్న పరమాత్మ అంశం. పరమాత్మ ఒక మహా వెలుగుముద్ద అయితే, జీవాత్మలు దాని నుండి వెలువడిన చిన్న చిన్న వెలుగురవ్వలు. అవి తిరిగి ఆ పెద్ద వెలుగులో లయం అవుతాయి, కాని నశించవు.
ఎలాగంటే.. నీటిలో తేలుతున్న మంచుముక్క నీటి కంటే వేరుగా కనిపిస్తుంది, కానీ కరిగి పోయాక అదే నీటిలో కలిసిపోతుంది. అలాగే, మన జీవాత్మ పరమాత్మలో మళ్లీ ఏకం అవుతుంది.
ప్రతి మనిషి అసలు పేరు “నేను” :
ఎవరినైనా ఏ పేరుతో పిలిచినా, వారు తమ గురించి చెప్పేటప్పుడు “నేను” అంటారు. అది అహంకారంతో వచ్చిన మాట కాదు.. తెలియకుండానే, అప్రయత్నంగా, మనలోని పరమాత్మ సాక్షాత్కారం ఆ పదంలో వ్యక్తమవుతుంది. అందుకే గీతలో ఎక్కడ “నేను” అని ఉంటే, దానిని కృష్ణుడు అనే అర్థంతో కాకుండా, తాను అనే ఆత్మస్వరూప అర్థంతో చదవమని ఆధ్యాత్మికులు సూచిస్తారు. అప్పుడు గీతా సారం కేవలం వచనాలుగా కాకుండా జీవితంలో ఆచరణయోగ్యమైన మార్గదర్శకత్వం అవుతుంది.
రాగం, భయం, క్రోధం — ఇవి ఎలా పోతాయి? :
శ్రీకృష్ణుడు చెబుతున్నాడు “నన్ను ఆశ్రయించి, నా జ్ఞానాన్ని చింతన చేస్తూ, నా కోసం తపస్సు చేస్తే, రాగం, భయం, క్రోధం లాంటి ప్రతికూల లక్షణాలు సహజంగానే తొలగిపోతాయి. అప్పుడు భక్తుడు నాతో నిండి, నాలోనే నిలిచిపోతాడు.” రాగం అంటే వ్యక్తులు, పదార్థాల ప్రత్యేక స్వభావాల పట్ల విపరీతమైన ఇష్టం. దానికి విరుద్ధం ద్వేషం. ఇవి రెండూ బంధనాలు. భయం అనేది కోరికల మూలం “కావలసింది దొరకదేమో, ఉన్నది పోతుందేమో” అనే ఆలోచనే భయానికి కారణం. భయం ఉన్నవాడు ఏదీ పూర్తి చేయలేడు. ఆ చేతకానితనం కోపానికి దారి తీస్తుంది. కోపం దీర్ఘకాలం ఉంటే అది క్రోధం అవుతుంది, ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. కానీ, మనలోనూ, ఇతరులలోనూ ఉన్న “నేను”ని గుర్తించి స్మరించినప్పుడు
రాగానికి కారణమయ్యే విభిన్నత తగ్గిపోతుంది
భయానికి కారణమైన స్వార్థం కరిగిపోతుంది
క్రోధానికి కారణమయ్యే విభజన మాయమవుతుంది
తపస్సు — “నేను” సాధనకు మార్గం
తపస్సు అంటే కేవలం అడవిలో కూర్చుని ధ్యానం కాదు.
శరీర తపస్సు — ఆచార వ్యవహారాలలో క్రమశిక్షణ
మనస్సు తపస్సు — ఆలోచనలలో పవిత్రత
మాట తపస్సు — సత్యం, మధురం, హితం మాట్లాడటం
శాస్త్రవేత్త ప్రయోగశాలలో రాత్రింబవళ్ళు శ్రమించడం, ఆటగాడు ఆటలో పూర్తిగా మునిగిపోవడం కూడా ఒక తపస్సే.
అలాగే, “నేను” అనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే తపనతో, దానికోసం కృషి చేయడం.. అదే ఆత్మజ్ఞాన తపస్సు.
అన్ని మార్గాలు ఒకే గమ్యం :
శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు “ఎవరిని ఎట్లా భావించినా, వారు అవతలి వారిలో ఉన్న నన్నే భావిస్తున్నారు. అందువల్ల వారు నా మార్గంలోనే ఉన్నారు.” కొంతమంది వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు. కానీ వారు కూడా చివరికి పరమాత్మనే, ఆ నేనునే ఆరాధిస్తున్నారు. ఈ విశ్వంలోని ప్రతి జీవిలో జీవాత్మ రూపంగా ఉన్న పరమాత్మని గుర్తించడం.. ఇదే నిజమైన వైష్ణవం.
సారాంశం
“నేను” = ఆత్మన్ = పరమాత్మ స్వరూపం
“నేను”ని గుర్తించకపోతే, గీతా సారం వచనాలకే పరిమితం
“నేను” సాధన చేస్తే — రాగం, భయం, క్రోధం సహజంగానే తొలగిపోతాయి
అందరిలో పరమాత్మని చూడటం — నిజమైన ఆధ్యాత్మిక దృష్టి
కృష్ణాష్టమి రోజున ఈ భావనపై ధ్యానం చేయండి.
“నేను” అనే పదాన్ని కేవలం మాటగా కాకుండా, మీ అసలు స్వరూపంగా గుర్తించండి.
అప్పుడు భగవద్గీత మీ జీవితంలో కేవలం గ్రంథం కాదు.. ప్రతిరోజూ మీకు దారిదీసే దీపస్తంభం అవుతుంది.
సాయికల్యాణ్ జమ్ము,
పొలిటికల్ అనలిస్టు,
మేనేజింగ్ డైరెక్టర్, జనస్వరం మీడియా