ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిగొట్ల అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లాలన్నా, ఆ గ్రామం నుండి రైతులు పొలాలకు వెళ్లాలన్నా ఒక చిన్న నది వయ్యేరు ను దాటాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ నదిని దాటడానికి, వారు “బల్లకట్టు” అనే సంప్రదాయ పడవపై ఆధారపడేవారు. ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తుప్పు పట్టడం వల్ల పాడైపోయేది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇలాంటి గ్రామాలకు వంతెన లేకపోవడం, కుదిరితే బల్లకట్టు ద్వారా, లేదంటే నదిలో నడుచుకుంటూ వెళ్ళడం బాధాకరం. రైతుల అవసరాల కోసం, విద్యార్థుల కోసం, గ్రామ ప్రజల రవాణా కోసం కలిగొట్ల, క్రొవ్విది గ్రామాల మధ్య ఒక వంతెన అవసరమని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఆ గ్రామ ప్రజల చేతులు పట్టుకున్నారే తప్ప, ఆ గ్రామ ప్రజలు చేతులు జోడించి వంతెన నిర్మించాలని వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వానికి ఎన్నో సార్లు మొర పెట్టుకున్నారు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా లేకపోయింది. 2016-17 సంవత్సరంలో గ్రామ యువత అంతా కలసి స్థానిక ఎమ్మెల్యేకు మెయిల్స్ పంపారు. ఫలితం లేకుండా పోయింది. 2021లో గ్రామస్తులు అంతా కలసి ఒక వంతెన నిర్మించాలని సంకల్పించుకున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.70 లక్షల ఖర్చవుతందని అంచనా వేసుకున్నారు. గ్రామానికి చెందిన అంకితభావంతో కూడిన రైతుల బృందం కలసికట్టుగా నిధులు సేకరించి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ చందాలు వేసుకున్నారు. ఫలితంగా రూ. 45 లక్షలు నిధులు సమకూరాయి. ఈ విషయం తెలుసుకున్న రాజు వేగేశ్న ఫౌండేషన్ ( ఇండియా ) చైర్మైన్ వేగేశ్న అనంత కోటిరాజు నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతానని సంకల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా రూ. 25 లక్షలు అందించారు. మొత్తం సమకూరిన రూ. 70 లక్షలతో గ్రామస్తులు స్వంతంగా కలిగొట్ల, క్రొవ్విది గ్రామాల మధ్య వంతెను నిర్మించుకున్నారు. అసాధ్యం అనుకున్న పనిని, ప్రభుత్వం సహకరించకపోయినా కలిగొట్ల గ్రామస్తులు సుసాధ్యం చేశారు. ఈ వంతెన వల్ల గ్రామానికి రవాణా సౌకర్యం, విద్యార్థులకు, రైతులకు, గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ బృహత్కార కార్యక్రమానికి విరాళాలు అందించిన గ్రామ ప్రజలకు, ప్రత్యేకంగా వేగేశ్న అనంత కోటిరాజుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు అభినందిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజల అవసరాలు తీర్చాలని కోరుతున్నారు.