●తూతూ మంత్రపు ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వైసీపీ ప్రభుత్వం
● ఎన్నికల సమసయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
● జనసేనతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
● జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్
సూళ్లూరుపేట, (జనస్వరం) : దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో 40వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. జనసేన షణ్ముఖ హ్యూహం, పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు, పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చింది లేదు. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింది లేదు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల ఊసే లేదని పేర్కొన్నారు. అలాగే ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత వైసిపి ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనుమరుగవుతున్నాయని అన్నారు. యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలంటే చిత్తశుద్ధి కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యమతుందన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్‌కి యువత బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఏడాది జాబ్ కేలండర్ ద్వారా నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా ఉద్యోగాలను ప్రకటించి చేతులు దులుపుకొందన్నారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని ఆర్భాటపు ప్రచారాలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమలో అమలు చేయకపోగా పక్క రాష్ట్రాల వారు స్థానికత పేరుతో ఏపీ యువతను తరిమేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి యువత భవిష్యత్తుపై దృష్టి సారించి ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువత ఆగ్రహానికి బలికాక తప్పదన్నారు.