జనస్వరం పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
రోజులు గడిచి నెలలు మారాయి సంవత్సరం మారింది. కానీ, మారని మన రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంపై - "నారీ స్వరం"
115 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏనాడూ ఎదుర్కోని సంకట స్థితిని నేడు ఎదుర్కొంటుంది. మన పెద్దలు ఏం చెప్పినా దానికి ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. "అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు" అనే మాట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ తీరుకి అతికినట్లు సరిపోతుంది.
ప్రపంచస్థాయి కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకుంటున్న మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రతిష్ట సొంత రాష్ట్రంలో ముసురుకున్న రాజకీయ నీలి నీడ పీడలా దాపురించి మసకబారి పోతుంది. చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల వినోద ప్రపంచం. కానీ రంగులు మార్చే రాజకీయ తెరపై నిలువెల్లా మోసపోయి నిస్తేజంగా నిలబడి పోయింది. రాజకీయానికి సినిమా రంగానికి పొత్తు లేదు, పోలిక లేదు, సంబంధం లేదు కానీ కారణాలు లేని కదనం మొదలయింది. ఆదాయం అందించే పరిశ్రమపై అజమాయిషీ చేయాలన్న ఆలోచనకు రూపం ఏపీ ప్రభుత్వ జివో నెంబర్ 35. సినిమా టికెట్లను ఆన్లైన్ పద్దతిలో విక్రయించాలి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయాలు జరగాలి ఇది ఏ పి ప్రభుత్వ జివో నం.35 సారాంశం. ప్రయోజనం లేని సమస్య కాస్తా సామాన్యునికి వినోదాన్ని చేరువ చేయాలనే సాకుగా మారిపోయింది.
నలుమూలల విశ్వ ఖ్యాతిని చాటుతున్న సమయంలో ఒంటి పోకడ నిర్ణయాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను కష్టాల పాలు చేస్తూ కుటిల రాజకీయం చేస్తున్నారు. వ్యక్తుల మీద కోపం వ్యవస్థల మీద ద్వేషంగా మార్చుకొని కళాకారుల జీవితాలను కష్టాల్లోకి నెట్టుతున్నారు. ఒక సినిమా తీయాలంటే తెర మీద నటీనటులు ముఖ్య భూమికలు పోషించినా తెర వెనుక టెక్నీషియన్లు మొత్తం 24 విభాగాల్లో వేల మంది ఉపాధి పొందుతారు. చలనచిత్ర పరిశ్రమ అంటే ఎన్నో వేల కుటుంబాల జీవనోపాధి అని మరువకూడదు. నాడు మద్రాసు నుండి తెలుగు చలన చిత్ర పరిశ్రమ భాగ్యనగరానికి తరలి రావటానికి ఎందరో మహానుభావులు కృషి మరియు ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన సహాయ సహకారాల వల్ల సాధ్యమయ్యింది. దేశ వ్యాప్తంగా ఎక్కువ సినిమా హాళ్లను కలిగి ఉన్న రాష్ట్రం మనది. నేడు తక్కువ ధరల టికెట్ల విక్రయంతో పాటు తనిఖీలు నిర్వహించటం వల్ల దాదాపు 300 సినిమా హాళ్లు మూతపడ్డాయి. సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తేవాలి అని ప్రభుత్వం చెపుతున్నా అది వాస్తవానికి దూరంగా ఉంది. అసలు రాష్ర్టంలో సమస్యలే లేనట్టు, రాష్ట్రాన్ని వేధిస్తున్న ఎన్నో సమస్యలను విడిచిపెట్టి మంత్రులు ప్రజాప్రతినిధులు సామాన్యునికి అవసరం కాని సినిమా టికెట్లు విషయంలో చర్చలు చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు, విద్యుత్తు చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల పేరిట అదనపు వసూళ్లు, ఆర్టీసీ 50% చార్జీల పెంపు, ఇవన్నీ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై చూపిస్తున్న ప్రభావం, భారం కనపడదు.
పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి, ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును పరాయి పరం చేస్తుంటే కనీసం ప్రశ్నించరు. రోడ్లు బాగు చేయరు రవాణా సౌకర్యాలు మెరుగుపరచరు. రాబడికి మించి రుణాలు చేస్తూ, ఉచితాలు పంచేందుకు తిప్పలు పడుతున్నారు. సమస్యలు పట్టించుకోరు, సమస్యలపై ప్రశ్నిస్తే సహించలేక వ్యక్తిగత దూషణలు ఇదే రాజకీయంగా మారిపోయింది. విలువలు మరిచి విచక్షణ కోల్పోయి పలికే నోటికి అదుపు ఉండదు. మాటకు పొదుపు ఉండదు. సామాన్యుని నిత్యావసరాల ధరలు నియత్రించలేని ప్రభుత్వం వినోదాన్ని అందించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. విపత్తుల్లో, ఆపదల్లో సామాన్యులను విస్మరించిన ప్రభుత్వం వినోదం అందించటానికి పెద్దపీట వేస్తుంది. ప్రకృతి ప్రకోపాలతో ప్రజలు అవస్థలుకు గురైతే పట్టని ప్రభుత్వం కళా రంగంపై కక్ష్య కట్టి వ్యవహరిస్తోంది. పరిష్కారం లేని సమస్య ఉండదు ప్రభుత్వం పట్టు వీడాలి, కళారంగానికి ప్రాధాన్యత కల్పించాలి. అటు సినీ రంగ పెద్దలు, ఇటు ప్రభుత్వం చొరవ చూపి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి.
- కృప, జ్యోతి, రేణు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com