
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 288వ రోజున 46వ డివిజన్ ఆచారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నేడు సీఎం జగన్ రెడ్డి గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 175 కి 175 గెలుస్తాం, మాకెవరూ పోటీ కారు అని మాట్లాడే సీఎం జగన్ రెడ్డి గారు ఇప్పుడెందుకు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఒంటరిగా పోటీ చేయడమా, పొత్తులతో పోటీ చేయడమా అనేది తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఇష్టమని, మా వ్యూహాలు మాకున్నాయని అన్నారు. రాష్ట్రం మొత్తాన్ని అవినీతిమయం చేసిన సీఎం జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నీతి సూక్తులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని, సీఎం జగన్ రెడ్డి గారు ఆ నీతి వాక్యాలను తమ ఎమ్మెల్యేలకు చెప్పి వారి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. అసలు జనసేన పార్టీ తమకు పోటీనే కాదని చెప్పే వైసీపీ ఇప్పుడెందుకు ఆతృత చూపుతున్నారని, పవనన్నని చూసి ఎందుకు వణుకుతున్నారని అన్నారు. 175 కి 175 కాదు కదా ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకతలో కనీసం 17 ఎమ్మెల్యే సీట్లు కూడా వైసీపీకి రావని, ఇదే వాస్తవమని, దిస్ ఈస్ వాస్తవం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.