
– తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర కురుబ సాధికారత డైరెక్టర్ రాగే ఎల్లప్ప
అనంతపురం, ఆగస్టు 18 (జనస్వరం): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ, రాజ్యాధికారం, వివిధ పదవులు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర కురుబ సాధికారత డైరెక్టర్ రాగే ఎల్లప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు బీసీల రాజకీయ సాధికారత, సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ విధానాలను కొనసాగిస్తూ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. రాజకీయ చరిత్రలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర పదవుల్లోనూ బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా తెలుగుదేశం పార్టీ బీసీలకు మరింత చేరువవుతుందని, పార్టీ పట్ల బీసీల ఆదరణ మరింత పెరుగుతుందని ఎల్లప్ప పేర్కొన్నారు. బీసీల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని ఈ నిర్ణయాలు మరోసారి రుజువు చేస్తున్నాయని ఆయన తెలిపారు.