పిఠాపురం, ఫిబ్రవరి 6, (జనస్వరం) : తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతల వక్రభాష్యం పూర్తిగా బట్టబయలైందని పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పాలకులు, వాటికే సమర్థన చెప్పే స్థాయికి దిగజారారని మండిపడ్డారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డు విషయంలో మొదట “నెయ్యిలో కల్తీ జరగలేదు, ఆవులు ప్లాస్టిక్ తిన్నందువల్ల సమస్య వచ్చింది” అంటూ ప్రజలను తప్పుదారి పట్టించిన వైసీపీ పెద్దలు, ఇప్పుడు “పామాయిల్, కెమికల్స్ కలిపిన నెయ్యి వాడాం” అంటూ మాట మార్చడం వారి అసలు స్వభావానికి నిదర్శనమని అన్నారు. ఇది కేవలం రాజకీయ అంశం కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుని ప్రతిష్టను కించపరిచే స్థాయికి వైసీపీ నాయకత్వం దిగజారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా దర్యాప్తు సంస్థలు కల్తీ జరిగినట్లు నివేదికలు ఇచ్చినా వైసీపీ నేతల్లో పశ్చాత్తాపం కనిపించకపోవడం దురదృష్టకరమని సూర్యప్రకాష్ విమర్శించారు. తప్పు చేసిన వారు బహిరంగంగా భక్తులకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు అరెస్టుపై వంగా గీత ఆవేదన వ్యక్తం చేయడాన్ని ప్రశ్నిస్తూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై బహిరంగ సభల్లో సభ్య సమాజం తలదించుకునేలా దూషణలు చేసినప్పుడు గీతకు ఎందుకు బాధ కలగలేదని సూటిగా నిలదీశారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చుపెట్టి ఎంతమంది అమాయకులపై కేసులు పెట్టారో వైసీపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. లడ్డు కల్తీ వివాదం వైసీపీ పాలనలో సాగిన అక్రమాలకు ప్రతిబింబమని, ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతోందని వ్యాఖ్యానించారు. పవిత్రత, విశ్వాసం, సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన వైసీపీ నాయకత్వం తక్షణమే బాధ్యత తీసుకుని ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.