నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 22వ రోజున 4వ డివిజన్ మారుతీ నగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్ళి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి సమస్యల పరిష్కారం దిశగా తాము పోరాడతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాల ఉతీర్ణతా తీరుని దుయ్యబట్టారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు సరిగ్గా జరక్క ఉత్తీర్ణత తగ్గిందని చెప్పడం ప్రభుత్వ అసమర్ధతకు, సిగ్గు లేనితనానికి నిదర్శనం అని అన్నారు. కోవిడ్ సమయంలో బోధన కోసం డిజిటల్ మాధ్యమాలు ఎలా ఉపయోగించాలని ఉపాధ్యాయులకు తర్ఫీదునిచ్చి నైపుణాన్ని పెంచకుండా ఉపాధ్యాయులను బ్రాందీ షాపుల ముందు బందోబస్త్ కి నిలబెట్టిన పరిస్థితి వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓ ప్రక్క ప్రయివేట్ పాఠశాలలు ఆధునిక బోధనా పద్ధతులు అవలంభిస్తే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక బోధనా పరికరాలు అందజేయాల్సిన ప్రభుత్వం అసలు ఆ దిశగా ఆలోచించిందా అని ప్రశ్నించారు. దీని కారణం గానే ప్రయివేట్ పాఠశాలల్లో 77 శాతం ఉత్తీర్ణత కనబడితే, ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 44 శాతం మాత్రమే ఉత్తీర్ణత కనిపించిందని అన్నారు. పదో తరగతి ఫలితాలను మూడు రోజుల పాటు వాయిదా వేయడం పైన కూడా తమకు అనుమానాలున్నాయని కేతంరెడ్డి ఆరోపించారు. రేషన్ కార్డులు ఎత్తేసి ఎలాగైతే కొన్ని పథకాలకు లబ్ధిదారుల్ని ఏరివేసారో, అదే తరహాలో ఉతీర్ణత తగ్గించి అనేక మంది విద్యార్థులు ఇంటర్ వెళ్లకుండా చేసి వారు అమ్మఒడి పథకానికి అర్హులు కాకుండా చేసే దురుద్దేశం ఉందేమో అని అనుమానాలు వ్యక్తం చేసారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరిలో అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులే అని అన్నారు. సప్లిమెంటరీ తరవాత కూడా 1 లక్షకు పైగా ఫెయిల్ అయితే వీరు ఇంటర్మీడియట్ లో చేరే అవకాశం లేదని, ఆ విధంగా 1 లక్ష మంది విద్యార్థులకు అమ్మఒడి ఎగ్గొట్టి 150 కోట్ల రూపాయల భారం తగ్గించుకునే ప్రభుత్వ ఎత్తుగడగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.