
నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 64వ రోజున మూలాపేట రాజాగారివీధి, అంకమ్మ గుడి వీధి ప్రాంతాల్లోజరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి సమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఒక ప్రణాళిక అంటూ లేకుండా నెల్లూరు నగరంలో పలు మునిసిపల్ పాఠశాలల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఆరవ తరగతి లోపు పిల్లలకు అయితే ఫర్వాలేదు కాని ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తొమ్మిదవ తరగతి వరకు తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఈ ఏడాది పదో తరగతిని ఇంగ్లీష్ మీడియంలో చదివి పరీక్షలు వ్రాయమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిభ కల్గిన విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ పడగలరా, ప్రభుత్వ పాఠశాలలకు ఉత్తీర్ణత తీసుకురాగలరా అని మండిపడ్డారు. పొదలకూరులో తొమ్మిదవ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన ఓ బాలిక కుటుంబం నెల్లూరు నగరానికి వచ్చేయడంతో పదవ తరగతి చేరడానికి ఏ పాఠశాలలో కూడా ప్రవేశం ఇవ్వని పరిస్థితి తనకు కనిపించిందని, ఇక్కడి మునిసిపల్ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంగా మారిపోవడం ఓ కారణమైతే, పదవ తరగతి ఉత్తీర్ణత శాతం తగ్గితే తమ పరిస్థితి ఏమిటోనన్న ఉపాధ్యాయుల ఆందోళన మరో కారణం అని అన్నారు. పవనన్న ప్రజాబాటలో ఇలాంటి సంఘటనలు అనేకం తనకు కనిపిస్తున్నాయని వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని ఎలా నాశనం చేసేసిందో చెప్పడానికి ఇవన్నీ తార్కాణాలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.