కోవూరు, మార్చి 30 (జనస్వరం) : నెల్లూరు జిల్లా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన మండలంలోని ఇనమడుగు గ్రామంలో నిర్వహించిన రైతుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ నాయకులు, రైతులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను "వరి" కంకుల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై అవగాహన ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టమని ప్రశంసించారు. రబీ సీజన్ ప్రారంభానికి ముందే ధాన్య సేకరణకు సంబంధించి పలు సార్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి శాసనసభలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ, పౌరసరఫరాల వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, సాక్షాత్తు ఈ జిల్లాకు చెందిన వ్యక్తే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతుల నుంచి ధాన్య సేకరణను విస్మరించి దళారులకు అప్పగించారని విమర్శించారు. ధాన్యం సేకరణలో రైతులకు గోనె సంచుల కొరత లేకుండా, లారీలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఏ రైస్ మిల్‌కు ధాన్యం ఇవ్వాలనేది వారి సొంత నిర్ణయమని, పూర్తిగా వారు ఇష్టప్రకారమే రైస్ మిల్లును ఎంచుకోవాలని సూచించారు. ధాన్య సేకరణలో రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడ్డా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదని అన్నారు. ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్‌మాల్ చేసి రూ. 82 కోట్ల మేర అవినీతి చేశారని, గత ప్రభుత్వంలో అన్నం పెట్టే రైతు మొర వినే నాధుడు లేరని అన్నారు. రైతులు అవగాహనా రాహిత్యంతో ధాన్యం బయట అమ్మవద్దని, అన్నదాతలు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. 22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకోవడంతో పాటు ఆధునికంగా ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు డ్రయర్లు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు రూ. 11,130 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నిధులను విడుదల చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతుల నుంచి సేకరించే సోనామసూరి, బిపిటి వంటి మేలు రకం ధాన్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయదని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం వినియోగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ధాన్య సేకరణలో కోవూరు ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పగానే స్పందించి సమస్య పరిష్కారానికై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే హమాలీ కూలీలతో సహా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన అన్నదాత సుఖీభవ ద్వారా ఏడాదికి రూ. 20 వేల ఆర్థిక సహాయం, ల్యాండ్ యాక్ట్ రద్దు, రాజముద్రతో కూడిన కొత్త పాసుపుస్తకాల పంపిణీ చేసిన విషయాలను ప్రస్తావించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన రేషన్ కార్డుల విభజన సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, జనసేన పార్టీ పీఓసీ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు షేక్ అల్తాఫ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ బాషా, జిల్లా మార్కెటింగ్, పౌరసరఫర, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
