
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 117వ రోజున 13వ డివిజన్ వేపదరువు జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వేసవి తీవ్రత తగ్గి వాతావరణం మారి శీతాకాలం వస్తోందని, ఈ క్రమంలో ప్రజలకు విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో నగరంలో అనేకమంది డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడిన సంగతిని గుర్తు చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నిరంతరం శానిటేషన్ చేస్తూ ఉండాలని, కాలువల్లో డ్రైనేజి వ్యర్ధాలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, తమ సూచనను అధికారులు సహృదయంతో స్వీకరించి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.