జగ్గంపేట, (జనస్వరం) : జగనన్న కాలనీలలో రహదారులు మరియు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించకపోతే తహశీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. రహదారులు నిర్మించాలని అడుగుతుంటే పోలీసు కేసులు పెడతామని బెదిరించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి, బావాజిపేట, వెదురుపాక గ్రామాలలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గుమ్మళ్ళదొడ్డిలో జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” కార్యక్రమంలో సూర్యచంద్ర పాల్గొన్నారు. బాధితుల నిరసన విషయాన్ని తెలుసుకుని గుమ్మళ్ళదొడ్డి వచ్చిన గోకవరం తహశీల్దార్ శ్రీనివాస్ ముందు సూర్యచంద్ర సమస్యలను ఏకరువు పెట్టారు. ఇళ్ళ స్థలాలు ఇచ్చే ముందు లే ఔట్ లో రహదారులు, అంగన్వాడిలు, పాఠశాలలు తదితర వాటిని ప్లాన్ లో రూపొందిస్తారని నాలుగు సంవత్సరముల తర్వాత ఇప్పుడు పోలవరం కాలువకు రహదారి ఏర్పరిచామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కలెక్టరుకి లేఖ ద్వారా తెలియజేస్తానని తహశీల్దార్ చెప్పడంతో ఆందోళన విరమించారు. సాధ్యమైనంత తొందరలో సమస్యలని పరిష్కరించకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సూర్యచంద్ర పేర్కొన్నారు.