
బనగానపల్లె, (జనస్వరం) : నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య పరిష్కారం దిశగా బనగానపల్లి జనసేన నాయకులు పత్తి సురేష్, జిల్లా ప్రచార నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నబాబు, నాయకులు గురప్ప, బోధనం ఓబులేసు, నాగప్రసాద్, చిన్న కిట్టు, వేణు, అభిలాష్, విజయ్, హర్ష ఆధ్వర్యంలో త్రాగునీటి కోసం ఇబ్బందిపడుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. పట్టణంలోని శ్రీరామనగర్ (దాసరి వీధి) లో మినరల్ వాటర్ ప్లాంట్ దాదాపు ఐదు సంవత్సరాల నుండి పని చేయకపోవడంతో అక్కడి ప్రజలు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి, అలాగే ప్రైవేటు ప్లాంట్స్ నీటిని కొనుక్కుంటున్నారు. ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్లాంట్ కు మరమ్మత్తులు చేయడంతో నీటి సరఫరా జరుగుతున్నది. త్రాగునీటి సమస్యను పరిష్కరించినందుకు అధికారులు, నాయకులకు జనసేన పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.