రాజోలు ( జనస్వరం ) : పి.గన్నవరం ప్రధాన పంటకాలువ నుండి నీరు పొంగి పొర్లుతుoడటంతో రాజోలులోని పలు వీధులు జలమయమయ్యాయి. పొదలాడ లాకుల వద్ద గేట్లు ఎత్తివేయడంతో కాలువలోకి భారీగా నీరు వచ్చి చేరిందని స్థానిక ప్రజలు వాపోయారు. రాజోలు మార్కెట్ సమీపంలో కాలువకు కట్టిన రక్షణ గోడ తక్కువ ఎత్తులో ఉండటంతో నీరు రోడ్డు పై నుండి పొర్లి పోతుంది. దీంతో కోళ్ళ వారి వీధి, నాయి బ్రాహ్మణ వీధి, కొత్త వెంకటేశ్వర స్వామి వీధుల్లోకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడి ప్రజలు నడిచి వెళ్లే మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు ఇళ్ళల్లో చేరి వాసన వస్తుందనీ పురుగులు, పాములు ఇళ్లల్లోకి చేరుతున్నాయని అక్కడి ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు. కాలువ ఎక్కువగా వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని అయినా కూడా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. నీరు ఎక్కువగా ఉండిపోవడం వల్ల దోమలు అధికంగా చేరి చిన్న పిల్లలకు పెద్దలకు జ్వరాలు వస్తున్నాయని రాత్రులు నిద్ర కూడా పోలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెబుతున్నారు. స్థానిక జనసేన నాయకులు మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చొరవ తీసుకుని అక్కడ నీటిని వెంటనే తొలగించాలని. ఇకపై ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.