ఆదిమానవుడు ప్రకృతిశక్తులైన ఉరుములు, మెరుపులు, పిడుగులు, జడివానలు మొదలైనవి చేసే భీకరమైన నష్టాలను చూసి భయపడ్డాడు. వాటిని అర్థం చేసుకోలేని అజ్ఞానంవల్ల, ఈ ప్రపంచంలో తమకు తెలియని వేరే ఏదో ఒక బలమైన శక్తి ఉందని భావించాడు. ఆ బలమైన శక్తినే తర్వాతి కాలంలో దేవుడు అని నమ్మడం మొదలు పెట్టాడు. సమాజంలో వర్గాలు ఏర్పడే క్రమంలో పూజారివర్గం అనేది ఒకటి పుట్టుకువచ్చింది. తాము దైవదూతలమని, తాము చెప్పిందే వినాలని, దేవుడు, మతం మొదలైన విషయాలను తమ నియంత్రణకోసం పటిష్టం చేసి, ప్రజలను తమకు విధేయులుగా ఉండే ఏర్పాటు చేసుకున్నారు. అట్లా ప్రజలు, వారిని పరిపాలించేవారు అనే రెండు వర్గాలు తయారు అయ్యారని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజానేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు . దేవుడి పేరుమీద కర్మకాండలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఒక తత్త్వశాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఆ తత్త్వశాస్త్రం ప్రజల్ని అజ్ఞానంలో ఉంచి, దోపిడీ చేసే ఒక నియంత్రణ సాధనంగా పూజారి వర్గానికి పనికి వచ్చింది. ఆదిమానవుడు తన అనుభవజ్ఞానంతో రూపొందించుకున్న సంస్కృతికి సంబంధించిన అనేక సదాచారాలను మతంలో విలీనం చేశారు. ఈ మతతత్త్వం అనేది ప్రకృతిలో సంభవించే ప్రతిమార్పుకు దైవాన్నే ఆధారంగా, మూలకారణంగా చూపింది. తద్వారా ప్రజల్ని దోపిడీ చేసే శక్తులకు ఆయుధంగా మారిందనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న విద్యార్థి, యువజనలకు రాసిన చైతన్య లేఖలో తెలిపారు. రాజు దైవాంశ సంభూతుడని, వర్ణవ్యవస్థను దేవుడే ఏర్పర్చాడని, కష్టసుఖాలు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలని, సాంఘిక పరిస్థితులన్నింటికీ మతపరమైన కారణాలే చూపింది.
కాలం గడిచేకొద్దీ మొత్తం మానవ జీవన విధానం మీద మతం పట్టు సాధించింది. మతతత్త్వాన్ని బోధిస్తూ, దానిమీద ఆధారపడి పబ్బంగడుపుకున్న ప్రభువులు సాధారణ ప్రజలమీద ఆధిపత్యాన్ని, నియంత్రణను సాధించారు. రాజులు, మతబోధకులు కలిసి ప్రజల్ని పాలిస్తున్న పేరుమీద దోపిడీ చేశారనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు. కానీ మరోవైపు ఆదిమకాలం నుండి కూడా ప్రకృతిని, దానిలో సంభవించే మార్పుల్ని పరిమితమైన చైతన్యంలోంచే అయినా సరిగ్గా అర్థం చేసుకున్నవారు కూడా ఉన్నారనీ,. విశ్వానికి ఆవల అతీతశక్తులు, దేవుడు, దయ్యం అనేవేవీ లేవని, మతం అనేది ప్రజలను దోపిడీ చేయడం కోసం రూపొందించిన సాధనమని చార్వాకులు, లోకాయత్తులు మొదలైన తొట్టతొలి భౌతికవాదులు తేటతెల్లం చేశారనీ, అయితే వీరి సంఖ్య తక్కువగా ఉండడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగే వైజ్ఞానిక శాస్త్రాలు లేకపోవడం, మనిషిలో సహజంగా ఉండే భయం అనేవి అన్నీ కలగలిసి మతవాదుల ఆధిపత్యాన్నే ముందువరుసలో నిలబెట్టాయనీ నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ స్వాప్నికుడు, అభ్యుదయ వాది, ప్రజానేస్తం పేర్కొన్నారు. మనుధర్మశాస్త్రం 'శూద్రుణ్ణిగానీ, స్త్రీనిగానీ, నాస్తికున్నిగానీ చంపడం చాలా చిన్నపాపం' అంటుంది. మతాన్ని స్థిరపర్చడం కోసం, బలపర్చడం కోసం, ప్రజల్ని మరింత కట్టుదిట్టంగా దోచుకోవడం కోసం రాసినటువంటి ఈమనుధర్మశాస్త్రం అనబడే మతతత్త్వశాస్త్రంలోని ఈ వాక్యం, మతం యొక్క లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుందనీ పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత బ్రిటీష్ ఆంత్రోపాలజిస్ట్ చార్లెస్ ఫిలిప్ డార్విన్ రాసిన జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం, ఈ భూమ్మీద మానవుడే మహాశక్తి సంపన్నుడు, ఆ మానవుడి చేతులు, చేపరెక్కల కంటే దృఢమైనవనీ, కళ్లు అనంత విశ్వాన్ని కూడా దర్శించగలవనీ, చెవులు ప్రపంచపు అవతల మాట్లాడే మాటల్ని కూడా వినగలవనీ,. పర్వతాల గుండా
సొరంగమార్గం కూడా వేసుకొని పోగలిగే శక్తి, ఎడారి భూముల్లోకి కూడా నీళ్లను మళ్లించగల శక్తి కేవలం మానవుడికీ మాత్రమే సొంతమనీ, కనుక ఆ మానవుడే తన సొంత శ్రమశక్తిద్వారా విజ్ఞాన శాస్త్రాలను రూపొందించాడనీ పేర్కొన్నారు.
మానవుడు ప్రకృతిలోని ఏ విషయాన్నైనా విశ్లేషించగలిగే అనేక రకాల విజ్ఞాన శాస్త్రాలను రోజురోజుకు మరింత అభివద్ధి చేస్తున్నాడనీ, ఒకప్పుడు భౌతికశాస్త్రం ఒక్కటే ఉండేది. ఇప్పుడు భూ భౌతికశాస్త్రం - ఖగోళశాస్త్రం కూడా ఉన్నాయి. పూర్వం రసాయన శాస్త్రం మాత్రమే ఉండేది. ఇప్పుడు భూ రసాయన శాస్త్రం, వ్యవసాయ రసాయన శాస్త్రం కూడా ఉన్నాయి. నూతన జ్ఞానం అభివృద్ధి అయ్యేకొద్దీ అనేకానేక శాస్త్రాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పోతున్నాయనీ విద్యార్థి, యువజనులకు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఒకవైపు గుండెను తీసి మళ్లీ అమర్చే శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటే... మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యం, బాణామతి మంత్రాలు ఇలాంటివి ఇంకొకవైపు పెరిగిపోతున్నాయనీ, మనిషి సజీవ సమాధి అయితే మోక్షం లభిస్తుందని చావడానికి సైతం వెనుకాడని మౌఢ్యం కూడా వ్యాపిస్తున్నదనీ, సొంత పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని సైతం నరబలి ఇవ్వడానికి సిద్ధమౌతున్న అవాంఛనీయ వాతావరణం మన సమాజంలో చోటుచేసుకుంటున్నదనీ సామాజిక పరివర్తకుడు , ఏదో ఒక రోజు సాయూధ పోరాటం ద్వారానే ఈ దోపిడీ వ్యవస్థ మారుతుందనే ప్రగాఢ నమ్మకం ఉన్న నక్సల్బరి వర్గ పోరాట వాది, కమ్యూనిస్టు, విప్లవకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న తాజాగా విద్యార్థి, యువజన లోకానికి రాసిన చైతన్య గీతికలో పేర్కొన్నారు.
మనిషి జీవితాన్ని మరింత అభివృద్ధి చేసి, ఉన్నత మార్గాలవైపు నడిపించడం కోసం ఒకవైపు విజ్ఞానశాస్త్రాలు కృషి చేస్తుంటే, మతవాదులు మాత్రం తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్లో మతాన్ని, మూఢనమ్మకాల్ని మరింత ప్రచారం చేస్తున్నారనీ,. దాని విషప్రభావం సమాజాన్ని మళ్లీ వెనక్కి తీసుకుపోతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సామాజిక వాతావరణంలో హేతువాద, మానవతావాద దృక్పథాన్ని అధ్యయనం చేయాలని, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మార్క్సిస్ట్, లెనినిస్ట్ సాహిత్యాన్ని,కమ్యూనిస్టు ప్రణాళికను తప్పనిసరిగా చదవాలని, చదివిన ఒక్కరు, పదిమందికీ తెలియజేయడం బుద్ధిజీవులందరి బాధ్యతగా ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. హేతువాదమే మానవతావాదమనీ, మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయనటువంటి నూతన సమాజం కేవలం కమ్యూనిస్టు సమాజంతోనే నూతన సమ సమాజం నిర్మాణం జరుగుతుందని, అదే ప్రపంచ మానవాళికి అవసరమైన జీవగంజి అని తెలుపడం, తెలుసుకోవడం బుద్ధి జీవుల విద్యార్థుల యువజనుల సమాజ మార్పును కాంక్షించే ప్రగతిశీల వాదుల కర్తవ్యమని పేర్కొన్నారు.
" దేవుడిని తయారు చేసినవాడు స్వార్థపరుడని, శ్రమ చేయకుండానే ఇతరుల కాయకష్టమును, శ్రమని దోచుకునే దొంగని, దేవుడి పేరును ప్రచారంచేసేవాడు ప్రజాధనంను దోచుకునే దొంగల ముఠా సభ్యుడని, దేవుడిని పూజించేవాడు అమాయకుడు, అజ్ఞానుడు, అనాగరికుడనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న విమర్శించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com