అనంతపురము ( జనస్వరం ) : ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, కవయిత్రి, కాలమిస్ట్, సామాజిక కార్యకర్త నల్లాని రాజేశ్వరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట పురస్కారం దక్కింది. ఈ మేరకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి లేఖ పంపారు. ఏలూరు వై.ఎం.హెచ్.ఏ. హాల్లో గురువారం సాహిత్య సంక్రాంతి సంబరాల్లో విశిష్ట అవార్డును ప్రదానం చేశారు. (అనివార్యకారణాల వల్ల రాజేశ్వరి హాజరుకాలేక పోవడంతో, ఆమె ప్రతినిధిగా కవి గుత్తా హరికి అవార్డును అందజేశారు.) ఈ కార్యక్రమంలో ఏపి సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్, ప్రముఖ రచయిత్రి బోయి హైమవతి, కార్పొరేటర్ శ్రీదేవి, ఏపి సృజనాత్మకత, సంస్కృతి సమితి సిఇఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామానికి చెందిన నల్లాని రాజేశ్వరి విద్య, సాహిత్య, సామాజికరంగాల్లో బహుముఖ సేవలందిస్తున్నారు. అనంతపురం జిల్లా బాలల సంక్షేమ సమితి (సి.డబ్ల్యు.సి) చైర్ పర్సన్ గా 2018 – 2021 కాలంలో విశేష సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2015 లో “రాజ్య మహిళా సమ్మాన్” అవార్డును అందుకున్నారు. శ్రీవెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శిగా, ఉదయ్ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలిగా, నల్లాని రాజేశ్వరి ఇన్షియేటివ్ ఫౌండేషన్ (ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్) ఛైర్ పర్సన్ గా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధరంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలందిస్తున్న పలువురిని గుర్తించి ప్రతి ఏటా కొందరికి అవార్డులిచ్చి ప్రోత్సాహిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (సోషియాలజీ), బి.ఎడ్., పూర్తి చేసి పిహెచ్.డి., పరిశోధన కొనసాగిస్తున్నారు. బాలికా విద్య, బాలల హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రజారోగ్యం, నైతిక విలువల పెంపు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రముఖ తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలో పలు వ్యాసాలు రాస్తున్నారు. టిటిడి ప్రచురిస్తున్న “సప్తగిరి” మాసపత్రికలో “బాలనీతి” శీర్షికతో బాలల కథలు, స్ఫూర్తిదాయక వ్యాసాలు రాస్తున్నారు. నల్లాని రాజేశ్వరి సామాజిక వ్యాసాల సంపుటి “సాధికారత” పుస్తకాన్ని 2019 జూలైలో అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. నల్లాని స్వీయ కవితాసంపుటి “బంగారుతల్లి” పుస్తకాన్ని 2021లో అప్పటి “తానా” అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, పూర్వ అధ్యక్షులు, ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తదితరులు తిరుపతిలో ఆవిష్కరించారు. ఆమె సేవలకు గుర్తింపుగా విద్యారత్న, సేవారత్న, మహిళా రత్న, బాలసేవక్ తదితర అవార్డులు, బిరుదులతో పలు సంస్థలు సత్క రించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట మహిళ అవార్డు- 2018, ఉగాది పురస్కారం- 2017 అందించి గౌరవించింది. తెలంగాణ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా 2017లో బతుకమ్మ పురస్కారంతో పాటు ఉత్తమ కవయిత్రిగా విశిష్ట అవార్డులతో సత్కరించాయి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ కవయిత్రిగా సత్కరించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల సందర్భంగా 2023 జూన్ 24, 25 తేదీలలో తానా – తెలుగు పరివ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో ప్రవాస బాలలకు అంతర్జాలంలో నిర్వహించిన “కథాకేళి” పోటీలకు జ్యూరీ సభ్యురాలిగా నల్లాని రాజేశ్వరి వ్యవహరించారు. తానా – తెలుగు తేజం పోటీల న్యాయనిర్ణేతగా 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ ద్వారా సేవలందించారు. తానా – ప్రపంచ సాహిత్య వేదిక 2021 ఏప్రిల్ 10, 11 తేదీలలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాకవిసమ్మేళనంలో ఫ్రాన్స్ ప్రతినిధుల సభకు జూమ్ ద్వారా ముఖ్యఅతిథిగా హాజరై తనదైన శైలిలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ మహిళాకమిషన్ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా కీలకోపన్యాసం చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు..ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, రచయిత్రి నల్లాని రాజేశ్వరి అంతర్జాతీయ “సేవారత్న” అవార్డును అందుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్, అధ్యక్షులు మురళి వెన్నెం, కార్యదర్శి రవి కొండబోలు 2023 అక్టోబర్ 23వ తేది గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన అక్కినేని శతజయంతి ఉత్సవాల్లో అవార్డును ప్రదానం చేశారు.