ఏలూరు ( జనస్వరం ) : సామాజిక చైతన్యమే లక్ష్యంగా సమాజాభివృద్ధికి అభ్యుదయ భావాలతో కవిత్వం రచించి కవులు సమాజానికి అంకితం కావాలంటూ, కవి కాలానికి ముందుమాట రాసేవాడు కావాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్, ప్రభుత్వ గుర్రం జాషువా కవి అవార్డుగ్రహీత, రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాతీయ సాహిత్య సదస్సు, జాతీయ కవిసమ్మేళనం ఆదివారం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ సారధ్యంలో, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి, డైరెక్టర్ ప్రకాశం అకాడమీ కొయ్యలగూడెం, విశ్రాంత విద్యాధికారి డాక్టర్ టి పార్థసారధి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ, కవులు కళాకారులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు. శ్రీశ్రీ, జాషువా,బోయి భీమన్న, వేమన, గురజాడ అందించిన సామాజిక చైతన్యంతో ఏర్పడిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఐఎస్ఓ గుర్తింపు పొంది, కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సాహిస్తూ, సుమారు 40 పుస్తకాలు సంస్థ ముద్రించిందని తెలిపారు. విదేశాలలో శ్రీశ్రీ కళావేదిక సభ్యులు సుమారు 20 వేల మంది ఉన్నారని, యువకులు 5000 మంది ఉన్నారని చెప్పారు. కవులు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకులు కావాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో ఏలూరులో 150 మంది పద్య కవులతో జాతీయ శతాధిక కవిసమ్మేళనం వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రతాప్ తెలిపారు. సామాజిక రుగ్మతలను పోగొట్టే రచనలు చేయాలని కత్తిమండ ప్రతాప్ కవుల్ని కోరారు. మహాకవి బోయి భీమన్న రచించిన పాలేరు నాటకాన్ని నేటికీ సమాజం ఆదరిస్తోందని, అందులో ఉన్న సామాజిక అంశం గొప్పతనం ద్వారా అనేక మంది జీవితాలు చదువు వైపు మళ్లి చైతన్యవంతం అయ్యాయన్నారు. మల్కీపురంలో వెయ్యి మంది ప్రజల మధ్య పాలేరు నాటకం శ్రీశ్రీ కళావేదిక వేయించిందన్నారు . అటువంటి మహానుభావుడి పేరుతో జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం అదృష్టమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో నెలకు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వచ్చే సంవత్సరం వరకు ప్రతినెలా ఒక్కో జిల్లాలో డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మరో ముఖ్య అతిథి ప్రకాశం డిగ్రీ కళాశాల చైర్మన్ వి.జనార్థన రావు శ్రీశ్రీ కళావేదిక చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రిన్సిపాల్ హనుమాన్ చౌదరి పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహిస్తూ, సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్న కత్తిమండ ప్రతాప్ ను అభినందించారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి మాట్లాడుతూ, కవుల దగ్గర ఒక్క రూపాయి కూడా రుసుం తీసుకోకుండా కమ్మని భోజనం పెట్టి కవులు, రచయితలకు సత్కారం చేయడం సంస్థ ప్రత్యేకత అన్నారు. శ్రీశ్రీ కళావేదిక చేస్తున్న గొప్ప కార్యక్రమాలను వివరించారు. మహిళా అధ్యక్షురాలు చిట్టే లలిత మాట్లాడుతూ, ప్రతిభను వెలికితీస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా శ్రీ శ్రీ కళా వేదిక ముందుంటున్నారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు తరపట్ల సత్యనారాయణ, కేంద్రీయ యూనివర్సిటీ సహాయ ఆచార్యులు డాక్టర్ బత్తల అశోక్, మహాకవి శ్రీనాధుని వంశీకులు డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ, జాతీయ కార్యదర్శులు ఫిజిక్స్ అరుణ్ కుమార్, గుండాల రాకేష్ ఏలూరు జిల్లా శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు శ్రీహరి కోటి, ప్రతినిధి రాజేంద్రప్రసాద్ కవులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీశ్రీ కళావేదిక ప్రతి నెలా సాహితీ ప్రభంజనంలో భాగంగా, మహాకవి బోయి భీమన్న పాలేరు నుండి పద్మ భూషణ్ వరకు , గుర్రం జాషువా సాహిత్యం - సామాజిక దృక్పధం, శ్రీశ్రీ కవిత్వం - విప్లవ అభ్యుదయ దృక్పథం, "ఆధునిక తెలుగు సాహిత్యం - వివిధ ప్రక్రియలు" అనే అంశాలపై జాతీయ తెలుగు సాహిత్య సదస్సులో ఆచార్యులు , కవులు , పరిశోధక విద్యార్ధులు 50 మంది పత్రసమర్పణ చేసి సభలో చదివారు. వందమంది కవితా గానం చేశారు. చిన్నారి రూపిక కూచిపూడి నృత్యం, కళాశాల విద్యార్థుల కవితాగానాలు అలరించాయి. అనంతరం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, డా. టి. పార్థసారథి వారి సతీమణి విజయలక్ష్మి, చేతులమీదుగా కవులను, పత్రసమర్పకులను సన్మానించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com