ఒంగోలు, (జనస్వరం) నవంబర్ 7 : ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన కవయిత్రి వల్లభుని ఝాన్సీదుర్గ నియమితులయ్యారు. అంతర్జాతీయ ఛైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ ఆదేశాల మేరకు, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రముఖ కవయిత్రి, రేడియో గాయని, సీనియర్ రచయిత్రి, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు వల్లభుని ఝాన్సీదుర్గ ప్రస్తుతం కళావేదిక ప్రకాశం జిల్లా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పలు ఉన్నత పాఠశాలల్లో వల్లభుని ఝాన్సీదుర్గ తెలుగు పండితురాలిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రధానోపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందారు. బాల్యం నుంచే సంగీత, సాహిత్యాలపై మక్కువ పెంచుకున్నారు. రేడియోలో అనేక సంవత్సరాలు పాటలు పాడి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మదిలోని భావాలకు అక్షర రూపమిచ్చి కవితలుగా మలిచారు. పలు సామాజిక సమస్యలపై స్పందించి తన రచనలు, ప్రసంగాల ద్వారా విద్యార్థులు, ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించారు. "జైఆంధ్ర" ఉద్యమకాలంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులున్న వేదికపై చిన్న వయసులోనే చైతన్య గీతాలు ఆలపించారు. మరో సభలో పి.వి. నరసింహారావు సమక్షంలో గళమెత్తి ఆయన మెప్పును కూడా పొందారు. జిల్లాలోని అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థలకు ఆర్థికంగా, హార్థికంగా తనవంతు ప్రోత్సాహం అందిస్తున్నారు. శ్రీశ్రీ కళావేదిక ఆశయాలు ఆమెకు ఎంతగానో నచ్చడంతో, ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షురాలిగా విశేష సేవలందిస్తున్నారు. ఆమె రచనలు, సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు లభించాయి. ఎందరో ప్రముఖుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఇప్పటికే ఆమెకు పలు అరుదైన గౌరవాలు దక్కాయి. అనేక అవార్డులు ఆమె కీర్తికిరీటంలో కలికితురాయిగా చేరాయి. విద్య, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవారంగాల్లో ఆమె చేసిన సుదీర్ఘ సేవలకు విశేష గుర్తింపు కూడా లభించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 2022 డిసెంబర్ 18 వ తేది పలువురు ప్రముఖులు ఆమెకు "సాహిత్యరత్న" బిరుదును ప్రదానం చేశారు. "సాహిత్యరత్న" వల్లభుని ఝాన్సీదుర్గ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులవడం పట్ల శ్రీశ్రీ కళావేదిక ఒంగోలు జిల్లా నాయకులు హర్షం వ్యక్తంచేశారు. తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి పదవిని, జాతీయ స్థాయి బిరుదును ఇచ్చి గౌరవిస్తున్న శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కు ఝాన్సీదుర్గ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com