పూసపాటిరేగ, అక్టోబర్ 13, (జనస్వరం) : క్రీడల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవడతాయని, క్రీడా మైదానమే తొలి పాఠశాలగా మారుతుందని నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి అన్నారు. క్రమశిక్షణ కలిగిన యువతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, అందుకు క్రీడలే సరైన మార్గమని ఆమె స్పష్టం చేశారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారిని భావి భారత విజేతలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా పూసపాటిరేగ మండలం కందివలస సమీపంలో నిర్వహించిన NPL క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంపొందిస్తాయని కొనియాడారు. ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన చింతపల్లి జట్టుకు 40,000 రూపాయలు, రన్నరప్‌గా నిలిచిన నెల్లిమర్ల జట్టుకు 20,000 రూపాయలు, ద్వితీయ రన్నరప్‌గా నిలిచిన కొవ్వాడ అగ్రహారం జట్టుకు 15,000 రూపాయల నగదు బహుమతులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. వ్యక్తిగత విభాగంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విజేతలకు చెరో 2,000 రూపాయల బహుమతులు ప్రదానం చేశారు. జనసేన నాయకులు కొట్ల రఘు (కొవ్వాడ సర్పంచ్), బాల అప్పలరాజు (గోవిందపురం సర్పంచ్)ల ప్రత్యేక పర్యవేక్షణలో ఈ క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమ్మరాజు, బాసి దుర్గ తదితరులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.