అమరావతి, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వద్దు అంటూ ట్విటర్లో అన్ని వర్గాల వారు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు విశేషంగా స్పందించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం ఉదయం 10 గంటలకు #Raise_Placards_ANDHRA_MP, #SaveVizagSteelPlant హ్యాష్ ట్యాగ్ లతో కూడిన ప్లకార్డు, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కూడిన ప్లకార్డుని ట్విటర్ లో పోస్టు చేసి డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మన రాష్ట్ర లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులకు బాధ్యత గుర్తు చేస్తూ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. ఎంపీలకు ట్యాగ్ చేస్తూ ఈ డిజిటల్ క్యాంపైన్ ను దిగ్విజయంగా నడుస్తోంది. #Raise_Placards_ANDHRA_MP, #SaveVizagSteelPlant హ్యాష్ ట్యాగ్ ల ద్వారా మొదలైన ఈ డిజిటల్ క్యాంపైన్ 600 మిలియన్లకు రీచ్ అయింది. జాతీయ స్థాయిలో ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పి.ఏ.సి. సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు, నియోజక వర్గాల ఇంచార్జులు, నాయకులు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎంపీలు స్పందించాలని ట్విట్టర్ ద్వారా కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, ప్లాంట్ దగ్గర ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ఎంపీలు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ ట్విటర్ లో పోస్ట్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు.