ఆత్మకూరు ( జనస్వరం ) : గుంటూరులో దళిత యువతి రమ్య హత్యకు నిరసనగా ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి, సత్రం సెంటర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, అర్ధరాత్రి ఆడ బిడ్డలు ఒంటరిగా నడవగలిగిన రోజే మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్లని గాంధీజీ సెలవిచ్చారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యమా నీవెక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?. స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత, స్వతంత్ర దినోత్సవం రోజే, గుంటూరు నగర నడిబొడ్డున, పట్టపగలు దళిత యువతి రమ్య హత్యకు గురైంది. మహిళలకు రక్షణ గా, గన్ కన్నా ముందే జగన్ వస్తాడు అని, ప్రగల్భాలు పలికిన నాయకులారా మీరెక్కడ.? అని జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది.గన్ను జగను రెండు మూగబోయాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహిళలకు రక్షణగా దిశా చట్టం తెచ్చామని ఎంతో ప్రచార ఆర్భాటం కల్పించారు. కానీ వాస్తవానికి దిశ చట్టం మనుగడలో లేదు. మనుగడలో లేని, దశ దిశ లేని దిశ చట్టానికి ప్రచారం కల్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే జగన్మాయ ఇది. రమ్య హత్యోదంతం తరువాత మన ఘనత వహించిన హోమ్ మంత్రిగారు మాట్లాడుతూ, ఆడవారు ఒంటరిగా బయటకు రావద్దని సెలవిచ్చారు. అంటే ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, మహిళల హక్కులు కాలరాయబడతాయని, ఘనత వహించిన హోం మంత్రి గారు చెప్పకనే చెప్పారు. ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు, ప్రగల్భాలు మాని, మహిళలకు రక్షణ కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, నియోజకవర్గం జనసైనికులతో కలిసి పాల్గొన్నారు.