– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు మోసపోయామని బాధపడుతున్నారు.
– ఏ వర్గానికి న్యాయం చేశారని ఈ బస్సు యాత్ర
– ప్రజా స్పందన కరువైంది
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ పాలన ఒక చీకటి యుగం
– జనసేనపార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ‘‘సామాజిక న్యాయ భేరీ’’పై జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు అందవలసిన పథకాలు కనుమరుగైపోయయాన్నారు. ఈ పథకాల మీద మాట్లాడే మంత్రులు లేరని, రాష్ట్ర ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్న ఏ ఒక్క ఎమ్మెల్యే గాని అసెంబ్లీలో మాట్లాడారని, వాళ్లకు సీఎం దగ్గర మెప్పుకోసం జై జగన్ అన్న అనే మాట తప్ప మరొకటి రాదని, ఈరోజు పార్టీ మనుగడ కోసం సామాజిక న్యాయ భేరీ యాత్ర కాదు అన్యాయ భేరీ యాత్ర చేస్తున్నారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనర్టీ వర్గాలు మోసపోయామని బాధపడుతున్నారని, ఏ వర్గానికి న్యాయం చేశారని ఈ బస్సు యాత్ర చేస్తున్నారని, ప్రజా స్పందన కరువైందని, అందుకు ఖాళీ కుర్చీలు నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ పాలన ఒక చీకటి యుగమని, సామాజిక న్యాయం అంటే ఒకే కుటుంబానికి రెండు మూడు పదవులు ఇవ్వడమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రచార పిచ్చి పట్టి పాలన గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో పాలన పడకేసిందని, జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పథకాలన్నీ రద్దయ్యాయని, ముందు వీటిపై మంత్రులు సమాధానం చెప్పాలని, విదేశీ విద్యా పథకం, పెళ్లి కానుక పథకం, సబ్సిడీ రుణాలు, కుల చేతివృత్తుల ఆదరణ పథకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ చట్టం ప్రయోగించడం, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించిక లేకపోవడం వంటి అంశాలపై బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రులు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసినందుకు రాబోయే రోజుల్లో జగన్‌కి తప్పక గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.