
జగ్గంపేట, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ కొండపల్లి వెంకటేశ్వర్లు ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం శ్రీ వెంకటేశ్వర్లు స్వగ్రామం జె.కొత్తూరు వెళ్లి కుటుంబ సభ్యులను పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరామర్శించారు. అతని తల్లి శ్రీమతి అమ్మాజీ, సోదరి దుర్గలకు ధైర్యం చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు వర్తించే ప్రమాద బీమా పథకం కింద రూ. 5 లక్షల చెక్కును వారికి అందచేశారు. శ్రీ వెంకటేశ్వర్లు చిత్ర పటానికి నివాళులు అర్పించి, కుటుంబానికి పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేశ్, జగ్గంపేట నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.