ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లాలో అన్ని రంగాల్లో దశాబ్దాలుగా దగాకు గురవుతున్న మన ఆత్మకూరు ప్రజానీకం మరోసారి దగా కాబడింది. వివరాల్లోకి వెళితే స్థానిక శాసన సభ్యులు మరియు మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారిచే ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా శంకుస్థాపన చేయబడిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ ఇక్కడి నుండి తరలింపునకు గురై, నిన్నటి రోజున కడప జిల్లా బద్వేలులో ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన చేయబడింది. ఈ చర్యతో దశాబ్దాలుగా పదేపదే దగాకు గురి కాబడ్డ మన ఆత్మకూరు ప్రజానీకం మరొకసారి దగాకి గురయ్యారు. ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లా అయిన బద్వేల్ లో పరిశ్రమ పెట్టదలచుకుంటే మరొక పరిశ్రమను తీసుకుని వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకానీ ఇక్కడ ఆర్భాటంగా శంకుస్థాపన చేయబడి ఆత్మకూరు అభివృద్ధి బాట పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆత్మకూరు ప్రజానీకం నమ్మకాన్ని వమ్ము చేస్తూ మరియు తమకు ఉపాధి దొరుకుతుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న యువత ఆశలపై నీళ్లు చల్లి, ఈ ప్రాంత అభివృద్ధిని సమాధి చేస్తూ ఈ పరిశ్రమను బద్వేలు తరలించడం ఎంతో శోచనీయం. 1600 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2500 ల పై చిలుకు ప్రత్యక్ష ఉద్యోగాలు, ఐదు వేల పైచిలుకు పరోక్ష ఉద్యోగాలు, జామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగకరమైన ఈ పరిశ్రమ వస్తుందని, దీంతో పాటు అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రజానీకానికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. పంచభక్ష పరమాన్నాలతో వడ్డించి తీరా తినే సమయానికి విస్తరణ లాగేసినట్లు ప్రభుత్వం వ్యవహరించడం ఎంతో దారుణం. కడప జిల్లా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కానీ నెల్లూరు జిల్లా కడప జిల్లా కన్నా మిన్నగా వైఎస్ఆర్సిపి పార్టీ ని ఎంతో ఆదరించింది. అయినప్పటికీ నెల్లూరు జిల్లాలో అత్యంత వెనకబడ్డ దశాబ్దాలుగా దగాకు గురి కాబడ్డ, ఆత్మకూరు నియోజకవర్గానికి ఇంతటి అన్యాయం చేయడం అత్యంత దారుణమైన విషయం. గతంలో ఇక్కడ శంకుస్థాపన చేయబడి భూ సేకరణతో సహా, మౌలిక సదుపాయాలు కల్పించబడ్డ ఈ పరిశ్రమను ఇక్కడే నెలకొల్పాలని లేనిపక్షంలో దశాబ్దాలుగా దగాపడ్డ ఆత్మకూరు ప్రజల గొంతుకై జనసేన పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధిని కాంక్షించే అన్ని రాజకీయపక్షాలను కలుపుకొని జనసేనపార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.