దెందులూరు, మార్చి 30 (జనస్వరం) : మండలంలోని మెట్ట గ్రామాలైన చల్లచింతలపూడి, రామారావుగూడెం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న పంట మాసూళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో కూలీల కొరత కొంత మేర ఏర్పడింది. ఈ ఏడాది మండలంలో రైతులు 2 వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న విత్తన పంటను విస్తారంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు, మాసూళ్లు వేగంగా సాగుతున్నాయి. పలు రకాల మొక్కజొన్న సీడ్‌లు అయిన ఎస్ ఆర్, త్రిమూర్తి, శుభం, భారతి, నూజివీడు సీడ్స్‌తో పాటు కమ్మర్ సీడ్స్ కూడా సాగు చేశారు. పంట మంచి దిగుబడి రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్కెట్లో సీడ్ మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు లాభాలు ఆశిస్తున్నారు. అయితే కూలీల కొరత కారణంగా మాసూళ్లలో కొంత ఆలస్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ కార్మికుల కొరతను దృష్టిలో ఉంచుకుని యంత్రాల వినియోగం పెరుగుతోందని తెలిపారు. అధికారులు కూడా పంట పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు సూచనలు అందిస్తున్నారు.