సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ, అడుగడుగునా వివక్ష, సొంత భూమిలోనే పరాయి బతుకు తరతరాలుగా మారని ఎస్సీ, ఎస్టీల జీవన ముఖ చిత్రం. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, అభివృద్ధికి, ప్రత్యేకంగా నిధులు కేటాయించే విధానమే ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్). ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ఈ సబ్ ప్లాన్ ఉద్దేశ్యం. ఈ సబ్ ప్లాన్ లోని 40 శాతం మూలధన నిధులు ఎస్సీ, ఎస్టీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించాలి ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా 16 % శాతానికి మించిన నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లక్ష్యం వారికి కేటాయించిన నిధులను వారి కొరకే ఖర్చు చేయాలి ఏ ప్రభుత్వమైనా ఆ నిధులు ఖర్చు చేస్తున్నారు కానీ ఏ ఉద్దేశ్యం కొరకు కేటాయించారో వాటి కొరకు ఖర్చు చేయటం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో స్కూల్, కాలేజ్, టాయిలెట్, తాగునీరు, కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిన కోసమే 40 శాతం నిధుల్ని సబ్ ప్లాన్ కి కేటాయించాలి. మన దేశంలో 1975-76 మధ్య కాలంలో మొదటి ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టిన ఘనత మాజీ ప్రధాని ఇందరాగాంధీ దే. 1979-80 మధ్య కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ గా, 2013 లో చట్టంగా మార్చారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పథకాల పేరిట, నవరత్నాల కోసం అంటూ ఖర్చు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించి, నవరత్నాల కోసం ఖర్చు చేయటం సరైంది కాదు.. అసలు సబ్ ప్లాన్ ఉద్దేశ్యం కనుమరుగైంది ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం ఖర్చు చేసింది శూన్యమే. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా సబ్ ప్లాన్ లక్ష్యానికి తూట్లు పొడిచి, దళిత సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను పక్క త్రోవ పట్టించి ఇతర పథకాలకు ఖర్చు చేస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకానికి నిధుల కేటాయింపుల వరకే, ఆ నిధులు ఏ పథకాలకు ఖర్చు చేస్తున్నారో కూడా తెలియట్లేదు ఖర్చు చేయని నిధులను తర్వాతి ఏడాది కేటాయింపులకు జత చేయాలి. జత చేయడం అనేది లేదు నిధుల మళ్ళింపును అడ్డుకునేందుకే ఉప ప్రణాళికల విధానాన్ని తెచ్చినా ఈ సబ్ ప్లాన్ లో కూడా నిధుల మళ్ళింపు తప్పటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్ళిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి, ఇతర చెల్లింపుల పేరు తో మళ్ళిస్తున్నారు. సబ్ ప్లాన్ కొరకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఆ సబ్ ప్లాన్ కోసం ఖర్చు చేయట్లేదు అనేది జగమెరిగిన సత్యం.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి అంటే ఎస్సీ – ఎస్టీలను కార్పొరేషన్ రుణాలు అనే విధంగా మార్చేసిన ఘనత ప్రభుత్వాలదే. వాడల్లో, కాలనీలలో శాశ్వత అభివృద్ధి ప్రయోజనాల కోసం కాకుండా రుణాల సబ్సిడీల ఎర చూపి బ్యాంకర్ల చుట్టూ రుణాల కోసం తిరుగుతున్న దుస్థితి. గత మూడున్నర దశాబ్దాలలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కోసం కేటాయించే నిధులను జనాభా దామాషాని బట్టి ఇవ్వక పోగా, కేటాయించిన లక్షల కోట్లు అసలు ఖర్చు చేయలేదని, కాగ్ నివేదికలు చెపుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వుంది ఈ ప్రభుత్వం.
దళితుల పథకాలకు కేటాయించిన కోట్లాది రూపాయలు వివిధ ఇతర పథకాలకు మళ్లిస్తూ, ఆ నిధులను ఖర్చు చేస్తూ దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతో ఘనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దళితులకు, ఆదివాసీలకు అందనంత దూరంలో వుండి, విద్యా, ఉపాధి, ఉద్యోగ రంగాలలో వారి పట్ల నిర్లక్ష్యం చూపిస్తూనే S.C., S.T. లను కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే విలువ ఇస్తూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నారనే చెప్పుకోవాలి. ఏదైనా చట్టం చేస్తే సరిపోదు. ఆ చట్టం అమలులో తీరుపై చిత్త శుద్ది, అజమాయిషీ అవసరం.