రాజమండ్రి ( జనస్వరం ) : బొండాలు సాగు చేసే రైతులు నానా కష్టాలు పడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో బుధవారం రైతుల కడగండ్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. చేతికి అందిన పంట అకాల వర్షాల దెబ్బకు నీటి పాలు కావడం తో రైతులు ఏం చేయాలో తెలియక అయోమయంలో కనిపించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ అకాల వర్షాల దెబ్బకు పంటలు నష్టపోతున్నా, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. మద్దతు ధర రూ.1530 లకు తడిచిన ధాన్యాన్ని కొంటామనే మాట చెప్పడం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్తే రూ.200, రూ.300 తక్కువకు కొంటామని బేరాలు ఆడుతున్నారన్నారు. కౌలు రైతులు అప్పులు చేసి సాగు చేస్తే చివరికి వాళ్ళకి రూపాయి కూడా దక్కని పరిస్థితి కనపిస్తోందన్నారు. ఈ పర్యటనలో కందులు దుర్గేష్ తో పాటు నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నాగు, మండల అధ్యక్షులు వీరబాబు, ప్రసాద్ రెడ్డి , మహిళా నాయకురాలు పాటంశెట్టి కాశీరాణి, జన సైనికులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.