గుంటూరు ( జనస్వరం ) : ప్రజారోగ్యం కాపాడుతూ, నిత్యం సమాజ పరిశుభ్రత కోసం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అన్నదాసు వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం నుండి స్థానిక కలెక్టరేట్ వద్ద గుంటూరు మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమి ఉదయ్ కుమార్, సోమి శంకరరావు గార్ల నేతృత్వంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. అన్నదాసు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మ్యానిఫెస్టోలో పొందుపరచిన విధంగా కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని, వారంలో ఒకరోజు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. సచివాలయ సెక్రటరీల పరిధిలో కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ పరిధిలోనే కార్మికులను కొనసాగించాలని, క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలని, బకాయి పడిన హెల్త్ అలవెన్సులు, కరోనా సమయంలోని జీతాలను విడుదల చెయ్యాలని కోరారు. అమ్మవడి వీరికి కూడా వర్తింపజేయాలని, అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన రేడియం జాకెట్లు, మాస్కులు, గ్లోవ్స్, చెప్పులు, శానిటైజర్లు అందజేయాలని, తరచుగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి మందులు పూర్తి ఉచితంగా అందజేయాలని కోరారు. కోవిడ్ సమయంలో తీసుకున్న కార్మికులను మరలా పనిలోకి తీసుకోవాలని, ఏ కార్మికునికి ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దీక్షా శిబిరాన్ని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, గుంటూరు నగర జనసేన పార్టీ కార్యదర్శులు తోట కార్తీక్, బొడ్డుపల్లి రాధాకృష్ణ, గుండాల శ్రీనివాసరావు, పుల్లంశెట్టి ఉదయ్ కుమార్, బండారు రవీంద్ర కుమార్, మిద్దె నాగరాజు, గుంటూరు రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గంధం సురేష్, నాయకులు ఆకుల సాయి, సతీష్, శ్రీనివాస్, ఫణీంద్ర శర్మ, కార్మిక సంఘం నాయకులు అజయ్, విజయ్ తదితరులు సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.