కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వ బాధ్యత అని పన్నుల పేరుతో ప్రజల మీద భారం వేయడం అన్యాయం అని జనసేన పార్టీ నియోజకవర్గ నేత బాడీశ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కరోనాతో తీవ్ర భయందోళనతో ఆర్థికంగా పలు కష్టాలు పడుతున్నారు .వారిలో ధైర్యం నింపి బ్రతుకు బండిని గాడినపడేలా చెయ్యాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి పైగా ప్రజలనుంచి కొత్త కొత్త పన్నులు ఎలా వసూలు చేయాలి ఉన్న పన్నులను ఎలా పెంచాలి అనే విషయం మీద దృష్టి పెట్టింది. మున్సిపాలిటీలో చెత్త పన్ను పేరుతో ప్రజలను పీడించే కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం సిద్దపడటాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతి ఇంటి నుంచి నెలకు 90 నుంచి 200 రూపాయలు వసూలు చేయాలనీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుండు మీద కారం చల్లిన మాదిరిగా ఉందని సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నాం అని చెబుతున్న అధికార పక్షం ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో గుంజుకోవడమే అవుతుంది. కరోనాతో ప్రజలు ఉపాధికి, వ్యాపారాలకు దూరమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో తగిన ఉపశమన చర్యలు తీసుకోవాలి తప్ప చెత్త మీద పన్ను వేస్తున్నాం ప్రతి నెల కట్టాలి అనడం బాధాకరం. కావున తక్షణమే చెత్త పన్ను విధించాలనే అర్ధరహిత ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.