ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, జనసైనికులతో కలసి నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రైలు మార్గం లేని నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. ఇవి రెండు, జిల్లాలో అన్ని రంగాలలో అత్యంత వెనుకబడిన మెట్ట ప్రాంతాలు. ఈ మెట్ట ప్రాంత వాసుల ఐదు దశాబ్దాల కల నడికుడి - కాళహస్తి రైల్వే మార్గము. దశాబ్దాల పోరాట ఫలితంగా, 2012 సంవత్సరం ఈ రైలు మార్గానికి సాంకేతిక అనుమతి లభించినప్పటికీ, 2018 వరకు నిధులు మంజూరు చేయబడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా 2018 నుండి 2021 వరకు మూడు సంవత్సరాల కాలంలో ఈ రైలు మార్గాన్ని పూర్తి చేయవలసి ఉన్నది. ఈ రైలు మార్గానికి అవసరమైన భూమిని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించవలెను. అంతేకాకుండా ఈ రైలు మార్గానికి అయ్యే ఖర్చులో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఈ ఒప్పందంలో భాగంగా గుంటూరు జిల్లా నడికుడి నుండి ప్రకాశం జిల్లా శ్రావల్యాపురం వరకు రైలు మార్గము పూర్తయి, ప్రజా ఉపయోగంలో ఉన్నది. ఒప్పందంలో భాగంగా సేకరించవలసిన భూమిలో ఒక్క సెంటు భూమి కూడా నెల్లూరు జిల్లాలో సేకరించబడని కారణంగా, ఈ జిల్లాలో రైలు మార్గము పనులు నత్తనడకన కొనసాగుతున్నవి. దశాబ్దాలుగా దగాపడ్డ మెట్ట ప్రాంత ప్రజల పట్ల పాలకుల వివక్షకు, నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఈ రైల్వే పనులు సకాలంలో జరగాలని గత సంవత్సరం ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయము అందరికీ విధితమే. ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేసే సమయములో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ రైల్వే నిర్మాణం సకాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. తదుపరి కాలంలో ఆ హామీ బుట్టదాఖలు అయినది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తమ వివక్షను విడనాడి, ఈ రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించి, రైల్వే శాఖకు అప్పగించ వలసినదిగా మరియు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను విడుదల చేయవలసిందిగా, జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.లేనిపక్షంలో దగాపడ్డ మెట్ట ప్రాంత ప్రజల గొంతుకై, జనసేన పార్టీ మరో పోరాటానికి సిద్దపడుతోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జన సైనికులు మరియు జనసేన నాయకులు లక్ష్మీ మల్లేశ్వరరావు, దాడి భాను కిరణ్, బండి అనిల్ రాయల్, పవన్, ప్రవీణ్,మదన్, రాకేష్, పేర్నాటి ప్రవీణ్, హరిబాబు, రాకేష్, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com