RTI ( సమాచార హక్కు చట్టం ) :
సాధారణంగా మనం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళిన, మనకు కావల్సిన సమాచారం పొందుట అంతా సులభం కాదు. దాదాపు చాలాచోట్ల లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలని పరిస్థితి. అదే సామాన్యుడు ఏ కార్యాలయానికి వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. వీటన్నింటిని పరిగణలోనికి తీసుకొని, భారత ప్రభుత్వం 2005 లో సమాచారహక్కుచట్టాన్ని రూపోందించినది. ఇది ఒకవిధంగా చెప్పాలంటే, నిజంగా వినియోగదారుని చేతిలో రామబాణం లాంటిది. వినియోగదారులు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని నిర్దేశిస్తుంది. ఇది అవినీతిని అంతంచేసే ఒక ప్రక్రియకు నాంది. ప్రముఖ ఉద్యమకారిణి అరుణారాయ్ చెప్పినట్లు “ప్రభుత్వయంత్రాగం స్వచ్చందంగా ప్రజలకు సమాచారం అందించాలన్నదే సహచట్టం ప్రధానోద్ధేశo”.
అంతర్జాలలో జీవోల ప్రతులను ఈ వెబ్ నుంచి పొందవచ్చు. www.goir.ap.gov.in రాష్ట్ర ప్రభుత్వం - www.apic.gov.in అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే - www.cic.gov.in ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే. ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని వీటిద్వారా పొందవచ్చు. www.rtionline.gov.in దరఖాస్తుదారు ఏ కార్యాలయo నుంచైనా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి దరఖాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు కార్యాలయంలో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరకాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తు చేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపరచవలెను. ప్రభుత్వం నుంచి లబ్ది పొందుతున్న జాతీయ పార్టీలు కూడా ప్రభుత్వ సంస్థల్లాంటివేనని, సమాచార హక్కుచట్టం వాటికి కూడా వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. కానీ దేశంలోని పార్టీలు దీని అమలుకు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమలుపర్చిననాడు దేశంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవినీతిని సమ్ముళంగా నిర్మూలించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
సమాచార హక్కు :
ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈచట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది, ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
సమాచారం :
రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు మొదలైనవి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా వుండవచ్చు.
ఉదాహరణకు :
రేషన్ డీలరు కార్డులు, అమ్మకాల వివరాలు
ప్రాథమిక ఆరోగ్యకేంద్రము వార్షిక నిధులు, ఖర్చులు, లబ్దిదారుల వివరాలు
ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులు, వారికి అందిన సహాయం
జిల్లా ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎమ్మెల్యే) నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగపు వివరాలు
ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి వివరాలు
ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు.. మొదలగునవి
ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధృవీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధృవీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చినది.
అన్వయింపులు :
ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థల సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన భధ్రతా లేక గూఢచార సంస్థలకి మినహాయింపు వుంది. అయితే, అవినీతి ఆరోపణలు మరియు మానవ హక్కుల అతిక్రమణలకు సంబంధించిన సమాచార విడుదల సందర్భములో ఈ మినహాయింపు వర్తించదు. ఈచట్టము క్రింద కొన్ని నియమాల క్రింద సమాచారమును ఇచ్చేందుకు మినహాయింపు ఉన్నది. అయితే, వాటిలో బహుళ ప్రజా ప్రయోజనము దృష్ట్యా సమాచారము ఇచ్చేందుకు కూడా అవకాశము ఉన్నది.
పద్ధతి :
సమాచారం అవసరమైన వారు, సంబందిత కార్యాలయం ప్రజా సమాచార లేక సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్ల కాగితంపై రాస్తే చాలు. వ్రాయటం తెలియకపోయినా సమాచారము సక్రమముగా కోరే అవగాహన లేకపోయినా సంబంధిత పౌర సమాచార అధికారి వారు తగిన సహాయము/ఏర్పాటు చేస్తారు. తెల్లకార్డున్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ దరఖాస్తు రుసుము లేదు. మండల స్థాయిలో రూ. అయిదు, జిల్లా స్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు. అడిగిన తరువాత నెల(గరిష్టం 30) రోజులు దాటితే, ఎంతటి సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరణ రసీదు తీసుకోవాలి. ఆ తేదినుండి 30 రోజులలోగా సమాచారాన్ని ఇవ్వాలి. ఇవ్వలేకపోతే లేక తిరస్కరించినట్లయితే దానికి కారణాలను తెలపాలి. ఏ సమాచారము ఇవ్వకుండా దరఖాస్తుకు ప్రతిస్పందించకుండా ఉంటే 30 రోజులు ముగిసిన తరువాత ఆ దరఖాస్తును తిరస్కరించినట్లుగా భావించబడును. అంతకుముందు, సమాచార ప్రతిని అందజేయటానికి అయ్యే ఖర్చు చెల్లింపమని దరఖాస్తుదారుని కోరవచ్చు. అటువంటప్పుడు, దరఖాస్తు దారుడు డబ్బు చెల్లించటానికి అవసరమైన, తీసుకొన్న సమయాన్ని గడువునుండి మినహాయిస్తారు. తిరస్కరించిన లేదా ప్రతిస్పందించని దరఖాస్తు విషయములో లేదా ఇచ్చిన సమాచారములో లోపాలు, వాస్తవ విరుద్దాలు లేదా తప్పులు ఉన్నవని భావించేటట్లయితె దరఖాస్తుదారు సంబంధిత అప్పిల్లేట్ అధికారి వారికి అప్పటికి సమాచారము సక్రమముగా లేదా అసలు అందకపోతే సంబంధిత సమాచార కమీషన్ వారికి విహిత రీతిన అప్పీలు చేసుకొవచ్చు.
ఈ దిగువ సందర్భములలో ఏ వ్యక్తి అయిననూ సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి నేరుగా పిర్యాదు చేయవచ్చు:
ఏదేని ప్రభుత్వ యంత్రాంగములో సమాచారము కొరకు దరఖాస్తు సమర్పించేందుకు గాని అప్పీలు స్వీకరించేందుకు గాని సంబంధిత పౌర సమాచార అధికారి లేదా సహాయ పౌర సమాచార అధికారి లేదా అప్పిల్లేట్ అధికారి వారిని నియమించలేదను లేదా ఖాళీగా ఉందను కారణముపై స్వీకరించుటకు తిరస్కరించిన దరఖాస్తు విషయములో సమాచారము ఇచ్చేందుకు చెల్లించకోరిన ఫీజు అసంబద్ధముగా ఉన్నదని భావించినట్లయితే సమాచారము కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు.
సహ చట్టం వివరణలు సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్ తేల్చి చెప్పారు. సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి 2 రూపాయలు చొప్పున ఫోటోస్టాట్ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు. కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.
ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం - 1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీర్పులిచ్చింది.
కొంతమంది వినియోగదారుల విజాయాలు :
ఈ చట్టాన్ని ప్రతి పౌరుడు సమగ్రంగా అవగాహన చేసుకొని, వారి పరిధిలో జరిగే అవకతవకలను నిరోదించడంతో పాటు, ప్రభుత్వ నియమాలను అతిక్రమించే వారిని/సంస్థలను అరికట్టవచ్చు. ఇది ప్రతి సామాన్యుడు దగ్గర ఉండే అస్త్రం లాంటిది.
#Written By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_india
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com