• పెరిగిపోతున్న ప్రమాదాలు
• రోడ్ల అధ్వాన్న స్థితే కారణం
• వాహనదారుల యాతనలు
• ప్రభుత్వం ఘోర వైఫల్యం
”ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం…ఏపీ రహదారులు సమస్తం ప్రమాదాల పరాయణత్వం” అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని గమనిస్తే. ఇదేదో సరదాగా చెప్పుకునే కవిత్వం కాదు… రక్తమోడుతున్న రోడ్ల సాక్షిగా కనిపించే దారుణమైన వాస్తవం! కేవలం పది నెలల్లో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య… 14,314! అంటే… నెలకు 1431! రోజుకు… 48! గంటకు… రెండు! ఇక ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుల సంఖ్య… 5,831! అంటే… నెలకు 583 మంది! రోజుకు…20 మంది! ఇంతేకాదు…ప్రమాదాల సంఖ్యను తీసుకున్నా… అశువులు బాసిన వారి సంఖ్య తీసుకున్నా…అవి కిందేడాదితో పోలిస్తే పెరిగాయని తెలిస్తే ఎవరి మనసైనా కలుక్కుమంటుంది! ఒక్క…వైకాపా ప్రభుత్వ నేతలకు తప్ప!! ఎందుకంటే… వారికి ఈ ప్రమాదాల గురించి కానీ, వాటికి ప్రధాన కారణాలలో ఒకటైన రోడ్ల దుస్థితి గురించి కానీ ఏమాత్రం పట్టదు! ఆ ధ్యాసే ఉంటే రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్నది కఠోర సత్యం! గ్రామీణ రోడ్ల నుంచి స్టేట్ హైవేల వరకు ఏ రహదారిని చూసినా గోతులతో, గొప్పులతో, గుంతలతో, కంకర రాళ్లతో, బురదతో, నీటి మడుగులతో కునారిల్లుతున్నవే కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాలను కలిపే రోడ్లు నీటి మడుగులను తలపించడమే కాదు, వాటిలో పందులు స్వైరవిహారం చేసే దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు కనీస మరమ్మతులు సైతం చేయకపోవడంతో వాహనదారుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఏ గొయ్యి ఎక్కడుందో, ఏ గొయ్యి ఎంత లోతుందో తెలియక వాహనదారులు వాటిలో పడి ప్రాణాలు సైతం కోల్పోతున్న దారుణాలు రాష్ట్రంలో నిత్యకృత్యమయిపోయాయి. తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఇక్కడి రహదారుల దారుణ స్థితిని గమనించి తన ప్రసంగంలో చురకలు వేశారంటే అదెంత సిగ్గుచేటో వేరే చెప్పక్కరలేదు. అయినా ఏమాత్రం చలించని తీరు వైకాపా ప్రభుత్వానిది. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ స్టేట్ హైవే రోడ్లు 14,722 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32, 240 కిలోమీటర్లు ఉన్నాయి. ఇతర రహదారులు 6,100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. వీటిలో 30,000 కిలోమీటర్ల మేరకు ఉండే రోడ్లకు కనీస నిర్వహణ సైతం లేని దౌర్భాగ్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని రహదారులకు కేవలం ఒక్క లేయర్ వేయాలన్నా కనీసం 7000 కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, నెల నెలా జీతాలు చెల్లించడానికి కూడా సతమతమవుతున్న జగన్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు చేయిస్తుందనే ఆశలు కూడా ఎవరికీ లేవు.
• ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి?
రోడ్ల దుస్థితి ఇలా ఉండగా…దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలుపై రోడ్ల నిర్వహణ పన్ను విధిస్తున్న విచిత్రం రాష్ట్రంలోనే కనిపిస్తుంది. లీటరు పెట్రోలుకి రూపాయి వంతున ఇలా రాష్ట్రంలోని వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం రూ. 670 కోట్లుగా ఉంది. అలాగే రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పేరు చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ప్రభుత్వం రూ. 2100 కోట్లు రుణం తెచ్చింది. మరి ఇన్ని కోట్లు ఎటు పోతున్నాయన్నది ఎవరికీ అంతుపట్టని విషయమే. రాష్ట్రంలోని ముఖ్యమైన 8000 కిలోమీటర్ల రోడ్లకు ఏటా కనీస నిర్వహణ మరమ్మతులు చేయాలన్నా కనీసం 1500 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఇక వీటికి నిర్ణీత కాల వ్యవధిలో రిపేర్లు చేయాలంటే మరో రూ.500 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధుల వివరాలను బడ్జెట్ లో చూపించినప్పటికీ వాస్తవంగా ఖర్చు పెట్టడం లేదు. ఇక ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల జరగక పోవడంతో రోడ్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.600 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోవడంతో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ స్పందించడం లేదు. అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారి భద్రత మండలి ఏర్పడినప్పటకీ రోడ్డు ప్రమాదాల నివారణలో ఫలితం కనిపించడం లేదు. ఈ కమిటీలో పోలీసు, రవాణా, ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్, వైద్య ఆరోగ్య శాఖల భాగస్వామ్యం ఉంటుంది. కేవలం రహదారి భద్రత అంశాలపై మాత్రమే ఆయా శాఖల నుంచి అధికారులను ప్రత్యేకంగా కేటాయించాలనీ, వారికి ఇతర బాధ్యతలు లేకుండా చేస్తేనే…వాళ్లు రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారని కూడా సుప్రీం కోర్టు కమిటీ సూచించినా…ఆ దిశగా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరోవైపు రహదారి భద్రత నిధి కింద ప్రభుత్వం రూ.125 కోట్లను కేటాయించామని గొప్పగా చెప్పుకుంటున్నా వీటిని కూడా ఖర్చు చేయని పరిస్థితి నెలకొని ఉంది. ఓ పక్క రోడ్డు సెస్‌తో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నా… మరో పక్క కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు తెస్తున్నా…ఆ డబ్బులను ఏం చేస్తున్నారో చెప్పాలనే బాధ్యతను సైతం విస్మరిస్తున్నా…కాంట్రాక్టర్లు మొహం చాటేస్తున్నారన్నా… ప్రమాదాలు ఏటికేడు పెరుగుతున్నాయన్నా…ప్రాణాలు కోల్పోతున్న దారుణాలు ఎక్కువవుతున్నా…వీటన్నింటికీ ఒకటే కారణం…అది జగన్ ప్రభుత్వం చేతకానితనం! చేష్టలుడిగినతనం!!