దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచి నియోజకవర్గానికి చేసింది శూన్యం
– పశ్చిమ నియోజకవర్గ కొండప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలి
– కొండ చరియలు విరిగి పడకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి
– జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : చిట్టినగర్ సొరంగం ప్రాంతం వద్ద బషీర్ వీధి, నూకాలమ్మ దేవాలయం ఎదురు వీధిలో అనేక ఇళ్ళ మీద కొండచరియలు విరిగి పడిన ప్రాంతాన్ని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సందర్శించి బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వర్షం పడినప్పుడు ఈ ప్రాంత ప్రజలు గుండెలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారన్నారు. అనేకసార్లు పశ్చిమ నియోజకవర్గ కొండప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కొండ చరియలు విరిగి పడకుండా, ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని గతంలో కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. కానీ గతంలో అధికారులు ఎవరూ కూడా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం లోని కొండ ప్రాంతాలు అన్నిటికీ మున్సిపల్ కమిషనర్ తప్పక రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టే విధంగా నిధులు కేటాయించి తక్షణమే పనులు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోగలరని, ముఖ్యంగా ఈ రోజు కొండ చరియలు విరిగిపడిన బషీర్ వీధి ప్రాంతంలో నివాసం ఉండి నష్టపోయినటువంటి 10 కుటుంబాలకు తక్షణమే మరమ్మతులు చేయించుకునేందుకు రూ.50 వేల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ ప్రాంతంలో మరొక్కసారి కొండ చరియలు విరిగి పడకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలని, నూకాలమ్మ ఎదురు వీధిలో, బషీర్ వీధి నివాసముండే వారిపై నిత్యం కొండరాళ్లు పడుతూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వారికి కూడా తగు న్యాయం చేయాలని మహేష్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం నుంచి గెలిచి చేసింది శూన్యమని, వర్షాకాల సమయంలో కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవిస్తున్న కొన్నిసార్లు ప్రాణనష్టం జరుగుతున్న మంత్రి దగ్గర నుంచి కనీస స్పందన లేదని, నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా గాలికొదిలేసి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదన మీదనే దృష్టి పెట్టారని, కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం, కొండ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు మంజూరుకు కనీస ప్రయత్నం చేయడం లేదని, అందుకే వర్షాకాల సమయంలో కొండ చరియలు విరిగి పడిన ప్రతిసారి నష్టం జరుగుతుందని ఈ నష్ట నివారణ పై కనీస దృష్టిసారించాలేని మంత్రి నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన విజయవాడ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మోబిన, కార్యదర్శి కొరగంజి వెంకటరమణ, ధార్మిక సేవ మండలి సభ్యులు తమ్మిన రఘు, నాళ్ళంశెట్టి కూర్మా రావు, రజిని తదితరులు పాల్గొన్నారు.