
కదిరి, (జనస్వరం) : అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గములో మండల వ్యవస్థ ఏర్పాటు కాకముందు దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద తాలూకా కేంద్రంగా కదిరి ఉండేది. తర్వాత మండల వ్యవస్థ రావడం దానిని 10 మండలాలుగా విభజించడం జరిగింది. ఆ తర్వాత కదిరి కేంద్రంగా కదిరి, పుట్టపర్తి రెండు నియోజకవర్గాలకు సంబంధించి 12 మండలాలను కలుపుతూ కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, పరిపాలన సౌలభ్యం పేరుతో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానిని జనసేనపార్టీ స్వాగతిస్తుంది, కానీ అందులో భాగంగా కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని తీసేసి పుట్టపర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని గెజిట్ లో ప్రకటించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగా కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పరిపాలనా సౌలభ్యం పేరుతో రెవెన్యూ డివిజన్ కార్యాలయంని మార్చడం ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని కదిరి జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నామని భైరవ ప్రసాద్ అన్నారు. పరిపాలన సౌలభ్యం అని చెప్పి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని మార్చడం ఇక్కడి ప్రజలను పుట్టపర్తి పొమ్మనడం ఏ విధంగా పరిపాలన సౌలభ్యమో ప్రభుత్వాధినేతలు, ప్రజా ప్రతినిధులు తెలియజేయాలని కదిరి జనసేన పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. భౌగోళికంగా, చారిత్రక ప్రాధాన్యం రీత్యా పూర్వపు తాలూకాలోని ప్రాంతాలను కలిపి, కదిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని కొనసాగించాలని, అలా కానీ పక్షంలో దాని కొరకు అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేయాల్సి వస్తుందని తెలియజేశారు.