
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 32వ రోజున జాకీర్ హుస్సేన్ నగర్, న్యూ కాలనీలోని పలు వీధులలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల తెల్ల రేషన్ కార్డులను తొలగించి వీలైనంత మంది లబ్ధిదారులను తొలగించుకోవడం టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. గత 32 రోజులుగా ఇప్పటికి సుమారు 7500 ఇళ్ళకు పైగా తాను తిరిగితే ప్రతి పది ఇళ్ళలో ఒకింటికి రేషన్ కార్డు తొలగించి ఉన్నారని దుయ్యబట్టారు. కరెంట్ బిల్లుల్లో యూనిట్ల పెరుగుదల, ఇంట్లో ఎవరైనా రుణం కోసం ఆదాయపన్ను చూపడం, ఇళ్ళల్లో ఏసీ కలిగి ఉండడం, సెకండ్ హ్యాండ్ లో కారు కొని ఉండడం, ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని కారణాలను చూపి రేషన్ కార్డులు తొలగించారని, ఇది సిగ్గుమాలిన చర్యని కేతంరెడ్డి విమర్శించారు. ప్రజల్ని ఈ ప్రభుత్వం బాధితులుగా మార్చేసిందని, ఇప్పుడు వారందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. తాము వెళ్ళిన ప్రతి ఇంట్లో ప్రజలు ఆత్మీయంగా పవనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తుకే ఓటేస్తాం అని చెప్తున్నారని, ప్రజల ఆశీస్సులతో పవనన్న ప్రజాబాట నెల్లూరు సిటీలో అనుకున్నదానికంటే విజయవంతంగా సాగుతోందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.