అనంతపురము, జులై 6, జనస్వరం : ప్రముఖ కవి, కథకులు, నవలాకారుడు, నాటకకర్త డా. రాసాని వెంకట్రామయ్య రచనలు సామాజిక జీవిత చిత్రణలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాసాని రచించిన "స్వర్ణముఖి కథలు" పుస్తకావిష్కరణ సభ సోమవారం పౌర గ్రంథాలయ శాఖ, విమలాశాంతి సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా సాగింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సభకు ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ విసి ప్రొ. కుసుమకుమారి హాజరై పుస్తకావిష్కరణ చేశారు. ఆత్మీయ అతిథులుగా ప్రముఖ మార్క్సిస్ట్ విమర్శకులు భూమన్, ప్రముఖ రచయిత డాక్టర్ శాంతి నారాయణ హాజరయ్యారు. ప్రముఖ కవి, సాహిత్య విమర్శకులు తూముచర్ల రాజారామ్ విశిష్ట అతిథిగా హాజరై పుస్తక సమీక్ష చేశారు. ఏపీ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, ప్రముఖ కవి సాహిత్య విమర్శకులు కొత్వాలు అమరేంద్ర ఆప్తవాక్యం పలికారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, రాసాని పరిశోధనాత్మకంగా 'ఆదియోధుడు', 'వొలికెల బీడు', 'ముద్ర', 'బతుకాట', 'వలస', 'పరస' 'నరమేధం', 'నేలతీపి', 'తరిగొండ వెంగమాంబ', 'చెంచిత', 'మెరవణి', 'ముల్లు గర్ర', 'నాలుగో నాటకం', 'రక్త చందనం' వంటి అనేక కథలు, నవలలు, నాటకాలు వెలువరించారని చెప్పారు. ద్రవిడ సమాజపు లోతులకు వెళ్లి, పరిశోధనలు చేసి, తెలుగు సాహిత్యానికి గొప్ప నవలలు, , నాటకాలు, కథలను అందించిన రాసాని అభినందనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో జిరసం అధ్యక్షులు కొత్తపల్లి సురేష్, ప్రొ. జి.వి. రమణ, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు, సెరా కుళ్లాయిస్వామి, డాక్టర్ నానీల నాగేంద్ర, ఈ. కమలాకర్, షహనాజ్, తరిమెల అమరనాథ రెడ్డి, డా. మల్లికార్జున, వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి, కమ్మన్న, టివి రెడ్డి, డా. జూటూరి షరీఫ్, షేక్ రియాజుద్దీన్, గుంటి మురళీకృష్ణ భరద్వాజ్, పూజారి ఈరన్న, సోమర రాహుల్ తదితరులు పాల్గొన్నారు.