రాజంపేట ( జనస్వరం ) : త్వరలో ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే రాజంపేటను కొత్త జిల్లాగా ప్రకటించాలని జనసేన నాయకులు మాదాసు నరసింహ గారు పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జన్మించిన, నడయాడిన తాళ్ళపాక నుండి తిరుమల పాదయాత్రను రాజంపేట, కోడూరు, కుక్కలదొడ్డి ప్రాంతంమీదుగా వెళ్ళారా? లేక అన్నమయ్య నడయాడిన ప్రాంతానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయచోటి మీదుగా వెళ్ళారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకా మరెన్నో అర్హతలు, విశిష్టతలు, సదుపాయాలు కలిగిఉన్న రాజంపేట కాదని, రాయచోటిని జిల్లాగా ప్రకటిస్తూ అన్నమయ్య జిల్లాగా నామకరణం చేయడం అన్యాయం అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతి పార్లమెంటు జిల్లాగా ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు జగన్ రెడ్డి మాట తప్పుతున్నారని అన్నారు. రాజంపేట అన్ని విధాలుగా భౌగోళికంగా రోడ్ లైన్, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, అన్ని సౌకర్యాలు కలిగినటువంటి రాజంపేటను విస్మరించి అన్నమయ్య నామమును పెట్టుకొని మనకు రాజంపేట ప్రజలకు పంగనామాలు పెట్టాలని చూస్తున్నారు. కావాలంటే 36 జిల్లాలు చేసుకోండి శ్రీకాంత్ రెడ్డి గారు… రాజంపేట ప్రజల మధ్య రాయచోటి మధ్య వైరం వచ్చే పరిస్థితి తీసుకురావద్దని అన్నారు. రాజంపేట ప్రజలు ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్ళి రాజంపేట అన్నమయ్య జిల్లాగా ప్రకటించే వరకు అన్ని పార్టీల వారు పోరాడాలని మాదాసు నరసింహ అన్నారు.