- హెడ్మాష్టర్ గొర్తి వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా పిటిఎం
అనంతపురము, డిసెంబర్ 5, జనస్వరం : విద్యార్థుల అభ్యాసంపై తల్లిదండ్రుల్లో చైతన్యాన్ని పెంపొందించే అత్యంత కీలకవేదిక మెగా పిటిఎం అని ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజాసమాఖ్య అధ్యక్షులు, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్తి వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస నాణ్యతను మరింత పెంపొందించడం, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందన్నారు. పాఠశాల తల్లిదండ్రుల మెగా సమావేశం 3.0 కార్యక్రమం శుక్రవారం కక్కలపల్లి ప్రాథమిక పాఠశాలలో హెడ్మాష్టర్ గొర్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, విద్యార్థుల అభ్యాస ఫలితాల ప్రదర్శన, విద్యార్థుల పోర్ట్‌ఫోలియో ఎగ్జిబిషన్, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, కమ్యూనిటీ పాల్గొనుట వంటి కార్యక్రమాలకు నిధులను వినియోగించామని హెడ్మాష్టర్ అన్నారు. మెగా పిటిఎం 3.0 కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు, అభ్యాస పురోగతి, చదవడం – రాయడం – లెక్కించడం (ఎఫ్ఎల్ఎన్) నైపుణ్యాలు, టెర్మ్ వారీ పరీక్ష ఫలితాలు, విద్యార్థుల నైపుణ్య స్థాయిలపై తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. అలాగే డిజిటల్ లెర్నింగ్, మన బడి నాడు–నేడు, స్వచ్ఛ విద్యాలయాలు, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై కూడా తల్లిదండ్రులకు స్పష్టత కల్పించామన్నారు. తల్లిదండ్రుల సూచనలను సేకరించి వాటిని పాఠశాల అభివృద్ధి ప్రణాళికల్లో అమలుచేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని గొర్తి వెంకట్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ప్రదర్శన గ్యాలరీలు, లెర్నింగ్ అవుట్‌కమ్స్ చార్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. తక్కువ హాజరు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక పరస్పర చర్యలు నిర్వహించామన్నారు. తరచూ మండల విద్యాధికారులు పాఠశాలలను ప్రత్యక్షంగా సందర్శిస్తున్నారని, సెక్టోరియల్ అధికారులు తమకు కేటాయించిన పాఠశాలల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. పాపంపల్లి స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్ కార్యదర్శిగా, కక్కలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పిటిఎం కార్యక్రమ నిర్వహణకు పూర్తి బాధ్యత వహించానని గొర్తి వెంకటస్వామి తెలిపారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల ప్రదర్శన, పాఠశాల శుభ్రత, ఫ్లెక్సీల ఏర్పాటు, బెంచ్‌లు, డెస్క్‌లు, అవసరమైన త్రాగునీరు, తేలికపాటి అల్పాహారం, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు, హాజరు అభిప్రాయ సేకరణ రిజిస్టర్ నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, దాతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తి వెంకట్ మాట్లాడుతూ, రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పాఠశాల విద్యాశాఖ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లు సకాలంలో పంపిణీ, సన్నబియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం, వన్ క్లాస్... వన్ టీచర్ విధానంతో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు అభినందనీయమన్నారు. తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ పదివేల కోట్లు జమచేశారని, తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాల బోధన, పాఠశాలల్లో సురక్షితమైన వాతావరణం కల్పన అభినందనయ మన్నారు.
విద్యార్థుల్లో నైతిక విలువల పెంపు ద్వారా సమాజంలో మార్పు కోసం పాఠశాల స్థాయి నుంచి కృషి, మెగా డీఎస్సీ 2025 ద్వారా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లు 78 మందిని సింగపూర్ విద్యా వ్యవస్థ అధ్యయనానికి ఏర్పాట్లు సంతోషకరమన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు "కలలకు రెక్కలు పథకం" ద్వారా ప్రోత్సాహకాలు శుభ పరిణామమన్నారు. మంత్రి నారా లోకేష్ కృషితో సమగ్ర శిక్షకు, పాఠశాల విద్యా శాఖకు వరుసగా కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధుల మంజూరయ్యాయన్నారు. ఏపీ సమగ్ర శిక్షకు గతంలో కంటే అదనంగా రూ. 432.19 కోట్ల నిధుల మంజూరు, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎమ్ శ్రీ) పథకం కింద రాష్ట్రంలో ఈ ఏడాదికి మొత్తం 80 పాఠశాలలను కేంద్రం ఎంపికచేయడం ప్రశంసనీయమన్నారు. లీప్ మోడల్, మోడల్ స్కూల్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, టీచర్ రిక్రూట్మెంట్ లో ముందడుగు పడిందన్నారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ను 2025 ఏప్రిల్ లో ప్రారంభించారని చెప్పారు. లీప్ అనేది ప్లే బేస్డ్ కరికులమ్ అని, పెడాగజి ట్రైనింగ్, ఏఐ డ్రివెన్ అసెస్మెంట్ లు ఇంక్లూడ్ చేస్తుందన్నారు. విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడంలో లీప్ కార్యక్రమం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా నూరు శాతం లిటరసీ టార్గెట్ ( అక్షర ఆంధ్ర ప్రోగ్రామ్) తో లింక్ అయిందని చెప్పారు. స్కూల్ బ్యాగ్స్ భారం తగ్గింపు, సెమిస్టర్ - వైజ్ సిస్టం అమలు జరుగుతున్నాయన్నారు.
