
విజయవాడ, నవంబర్ 30, (జనస్వరం) : విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు మార్కెట్ యార్డులలో నెలకొన్న సమస్యల గురించి వివరించారు. యార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాల లోపాలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రికి అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన మార్కెట్ కమిటీ సమావేశంలో మార్కెట్ అభివృద్ధి పనులపై తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ సంబంధిత రిజల్యూషన్ పత్రాలను మంత్రికి అందజేశారు. మార్కెట్ యార్డుల అభివృద్ధికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు వీలైనంత త్వరగా మార్కెటింగ్ కమిషనర్‌తో చర్చించి అవసరమైన అనుమతులు విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారంటూ వ్యాఖ్యానించారు. రైతుల అనుసంధాన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీలను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో పుట్టపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్, జనసేన నాయకులు ముత్యాల కరుణాకర్, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.