విజయవాడ, అక్టోబర్ 7, (జనస్వరం) : కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ యాడ్ చైర్మన్ లు ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పుట్టపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పూల శివప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మార్కెట్ వ్యవస్థలను ఇష్టానుసారం నిర్వీర్యం చేశారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాటికి పునర్జీవం పోసి మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు అండదండలుగా నిలబడేలా చర్యలు తీసుకోనున్నట్లు సమావేశంలో చర్చించారు. అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం కారణంగా విదేశాలకు ఎగుమతికి వెళ్లాల్సిన పంటలు నిలిచిపోతున్నాయని, అదే విధంగా రైతులు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అవగాహన కల్పించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచడం ద్వారా పంట నాణ్యతతో పాటు రైతుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచించారు. అలాగే రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ ల అధ్యక్షులుగా నంద్యాల చైర్మన్ హరి బాబును, ఉపాధ్యక్షులుగా మదనపల్లి చైర్మన్, జనసేన నాయకులు జంగాల శివరాంను ఎన్నుకున్నారు. ఈ సమావేశం మార్కెట్ వ్యవస్థ పునరుద్ధరణకు కీలకంగా మారనుందని పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.