క్వారంటైన్లో మెరుగైన సేవలను అందించాలి – జనసేన పార్టీ డిమాండ్.
రాష్ట్రంలో కరోనా కష్టకాలం కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బారిన పడిన ప్రజల పట్ల వారికి అందించాల్సిన మెరుగైన వైద్యం, ఔషధాలు, పౌష్టికఆహారం, ఇంకా కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం చెందిందని జనసేన పార్టీ కడప నగర అధ్యక్షుడు మాలే శివ, జిల్లా లీగల్ సెల్ నాయకులు తోట బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
👉 జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా బాధితుల చికిత్సకు అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు. క్వారంటైన్ లో ఉన్నటువంటి కరోనా బాధితులను వైద్యేతర కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా బాధిస్తున్నది అన్న విషయాన్ని అనేకమార్లు స్వయంగా బాధితులే వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియ చేసినప్పటికీ సదరు సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం గాని జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం గాని నేటి వరకు మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేయకపోవడం కరోనా బారిన పడిన టువంటి ప్రజల పట్ల వారు ఎదుర్కొంటున్న కష్టనష్టాల పట్ల వీరికున్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అన్నారు.
👉 ఈ నిర్లక్ష్యం కారణంగానే కడప జిల్లాలో కరోనా బారిన పడిన ఇద్దరు పాత్రికేయులు సరైన వైద్య సదుపాయాలు అందక తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన దురదృష్టకర సంఘటనను చూడవలసి వచ్చింది అన్నారు.
👉 క్వారంటైన్ కేంద్రాల్లో పని చేస్తున్నటువంటి వైద్యులు మరియు సిబ్బంది కరోనా బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ సేవలందించడానికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పనలో కూడా ప్రభుత్వ అశ్రద్ధ వహిస్తున్నకారణంగా వైద్యులు మరియు సిబ్బంది ప్రతిక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, తమకు అవసరమైనటువంటి రక్షణ సదుపాయాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాల్సిన టువంటి పరిస్థితి నెలకొని ఉండడం నిజంగా శోచనీయం అన్నారు.
👉 ఒకపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా బారిన పడిన టువంటి బాధితులకు సరైనటువంటి వైద్యంతో పాటు పౌష్టికాహారం పారిశుద్ధ్యం తో కూడుకున్న మౌలిక సదుపాయాలు తప్పనిసరి అవసరమని గగ్గోలు పెడుతుంటే మరోపక్క మన జిల్లాలో ఉన్నటువంటి క్వారంటైన్ లలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరం అన్నారు.
జిల్లాలో కరోనా విలయతాండవం కారణంగా పాజిటివ్ కేసులు తో పాటు, మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా టెస్ట్లు, ఫలితాల వెల్లడిలోనూ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను అనుసరించని కారణంగా తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే తక్షణం మెరుగైన వైద్యం ప్రారంభించేలా క్వారంటైన్లలో ఏర్పాట్లు లేకపోవడ కారణంగా కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తికి ప్రతి రోజూ, ప్రతి గంటా అత్యంత కీలకమైనవని వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలోని జిల్లాలోని క్వారంటైన్లలో వైద్య సిబ్బందికి, సహాయ సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ కిట్లు, కరోనా బాధితుల అందరికీ అవసరమైన పౌష్టికాహారం, మందులు, ఆక్సిజన్, పారిశుద్ధతతో కూడుకున్న మౌలిక సౌకర్యాల కొరత లేకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు ముమ్మరం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాలే శివ, తోట సుబ్రమణ్యం తదితర జనసైనికులు పాల్గొన్నారు.