ఏలూరులో పెట్రోలు, డీజిల్ పెంపు ధరపై నిరసన కార్యక్రమం చేపట్టిన జనసైనికులు
పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ లాంటి ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో జనసేన పార్టీ రోడ్డెక్కింది. స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ లో జనసేన పార్టీ ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ధర్నాకు దిగింది. రోడ్డుపై ద్విచక్రవాహనాలు తోసుకుంటూ జనసైనికులు నిరసన తెలిపారు. భారీగా వేసిన పన్నులతో ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం లీటరుకు రూ. 4 మేర అదనంగా పన్ను వసూలు చేస్తోందన్నారు. కరోనా దెబ్బకి ఉపాధి కోల్పోయిన మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి ప్రభుత్వ చర్యలు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారయ్యాయన్నారు. మోటారు సైకిళ్ల మీద చిరు వ్యాపారాలు చేసుకునే వారు, ఆటో వాలాలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. సామాన్యుడిపైనా పన్నుల భారం పరోక్షంగా తీవ్ర స్థాయిలో ఉందన్నారు. సంక్షేమం ముసుగులో ప్రభుత్వం రూ. 10 జేబులో పెట్టి రూ. 100 తిరిగి లాక్కుంటోందని మండిపడ్డారు. ఇంధనంపై రోడ్ ట్యాక్స్ పేరిట వసూలు చేయడం వైసీపీ పాలనకు అద్దం పడుతోందన్నారు. పెంచిన టాక్స్ వెంటనే తగ్గించాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం టాక్స్ వేసినప్పుడు గగ్గోలుపెట్టిన మీరు ఇప్పుడేం చేశారని నిలదీశారు.