
నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా 7న నిరసన దీక్ష – శ్రీ పవన్ కల్యాణ్ గారు…
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ. 10 వేల రూపాయిల ఆర్ధిక సాయం అందించాలనీ, ఎకరాకి రూ. 35 వేల ఆర్ధిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాని పక్షంలో రైతాంగానికి మద్దతుగా ఈ నెల 7వ తేదీన అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపడుతుందని తెలిపారు. నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలో శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “పంట నష్టం రూ. 35 వేలు అన్నది జనసేన పార్టీ చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడినప్పుడు ఎకరాకి రూ. 35 వేల నుంచి రూ. 40 వేలు సాయం చేయాలన్న డిమాండ్ వారి నుంచి వెలువడింది. వరుసగా మూడు పంటలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బ తినడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వాలి పోయిన పంటను తీయాలన్నా ఎకరాకి రూ. 8 వేలు నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కళ్ల ముందే పంట ఉన్నా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ. 35 వేలు ఇస్తే ఎంతో కొంత బయటపడతారు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు ఆ డిమాండ్ పెట్టాం. తక్షణ సాయం అందించడానికి 48 గంటల సమయం ఇచ్చాం. ఈ పరిస్థితుల్లో మనుషులు మనోనిబ్బరం కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తక్షణ సాయం అందించాలి.
రూ.16వేల కోట్ల మద్యం ఆదాయం ఉంది కదా
రూ. 35 వేలు పంట నష్ట పరిహారంతోపాటు రూ. పది వేలు తక్షణ సాయం అందించాలని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదా అంటే మంత్రుల నుంచి వైసీపీ నాయకుల వరకూ అంతా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బలంగా ఉందని చెబుతున్నారు. మద్యపానం మీద వచ్చే ఆదాయం వద్దనుకునే వైసీపీ నాయకులు మద్య నిషేధం చేస్తామన్నారు. ఇప్పుడు ఏటా రూ. 16 వేల కోట్ల పై చిలుకు ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. వైసీపీ నాయకులకు ఆ ఆదాయం అక్కరలేనప్పుడు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రైతులకు అందచేయండి. ఐదు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా 17 లక్షల పైచిలుకు ఎకరాలు నష్టం వాటిల్లింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నష్టపోయిన రైతులకు అందచేయండి.
151 మందితో బంగారు పాలన ఇస్తారనుకుంటే మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారు
వైసీపీ నాయకత్వం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. అంచెలంచెలుగా చేస్తామన్నారు. తీరా చూస్తే గవర్నమెంటు మద్యం అమ్మకాలు చేపట్టింది. చిత్రవిచిత్రమైన బ్రాండ్లు అమ్ముతున్నారు. బూమ్, సుప్రీం, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అంట. బంగారు తెలంగాణ విన్నాం గానీ.. బంగారు ఆంధ్రను బ్రాండ్ల రూపంలో అమ్ముతారని ఇప్పుడే విన్నాం. బంగారు ఆంధ్ర అంటే 151 మందితో మంచి పాలన అందిస్తారనుకున్నాం. ఆంధ్ర గోల్డ్ అంటూ మందు బాటిల్స్ అమ్ముతారనుకోలేదు. ప్రెసిడెంట్ మెడల్ తో పాటు సిఎం మెడల్ అని, వైసీపీ స్పెషల్ అని కూడా బ్రాండ్లు అమ్మి సొమ్ము చేసుకోండి. వచ్చిన డబ్బును మాత్రం తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇవ్వమని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతులు బయటకి వస్తే పరిస్థితులు మరో విధంగా మారిపోతాయి. మహారాష్ట్రలో చూస్తున్నాం పరిస్థితి ఎలా ఉందో. భూమి దున్నే రైతుకి ముఖ్యంగా కౌలు రైతుకి జనసేన అండగా ఉంటుంది. పార్టీ తరపున జైకిసాన్ అనే కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. సీనియర్ నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూర్చుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు భవిష్యత్తులో ఏం చేయాలో ప్రణాళిక రచిస్తాం. ఇది ఒక్క రోజులో పోయే సమస్య కాదు.
భూమి కోతకు గురైన రైతులకు అండగా నిలబడాలి
నివర్ తుపాన్ వల్ల జరిగిన నష్టం కంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ ఉంది. సోమశిల రక్షణ గోడ లేకపోవడం, ఆయకట్టు నిర్మాణం లేకపోవడం, చిన్న చిన్న రిపేర్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, కనీసం రూ. 25 వేల విలువ చేసే గేట్లు ఎత్తే వైర్లు కూడా లేకపోవడం వంటి నిర్వహణ లోపాలు ఉన్నాయి. సెప్టెంబర్ లో కూడా నిర్వహణ లోపం వల్ల వరదలు వచ్చాయి. ఇప్పుడు వరదలకు నెల్లూరు నగరంలోనే 30 బస్తీలు మునిగిపోయాయి. అలాగే రాయలసీమలో కూడా.
మరో అంశం నదీ పరివాహక ప్రాంతాలలో సమస్య. బాహుదా, స్వర్ణముఖి, మాండవ్య పరివాహక ప్రాంతాల్లో భూమి కోతకు గురై పంట మొత్తం పాడవడంతోపాటు భూమి కోతకు గురైంది. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూమి కోతకు గురయ్యింది. రైతులకు ఎకరం పొలం ఉంటే అందులో అర ఎకరం కోతకు గురైపోయింది. ఆ ప్రాంతంలో పొలాలు నిలబెట్టుకునేందుకు తిరిగి మట్టి ఫిల్ చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం అందించాలి. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఇప్పించాలి. అలాగే కడప టౌన్ లో బుగ్గవంకను సరిగా నిర్వహించకపోవడం వల్ల కడప టౌన్ లో 20 వేల కుటుంబాలు నిర్వాసితులయ్యారు. మా నాయకులు అక్కడ ఫోటోలు చూపిస్తుంటే చాలా బాధ కలిగింది. రైల్వే కోడూరులో విపరీతంగా పంట నష్టం జరిగింది. వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంత పంట నష్టం జరిగితే అసెంబ్లీ సెషన్స్ లో దాని మీద చర్చకు కేవలం ఒక్క రోజు కేటాయించారు. మిగిలిన నాలుగు రోజులు.. ఒకరిని ఒకరు ఎద్దేవా చేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. పాదయాత్రలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం తాలూకు కష్టాలను స్వయంగా తెలుసుకుని వారికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్ని విశ్వనగరం ఎన్నికలుగా చూశారు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారన్న విషయం అర్ధమయ్యింది. కొత్త తరహా పాలనా వ్యవస్థను కోరుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఒక నగర ఎన్నికలుగా చూడలేదు. ఒక విశ్వనగర ఎన్నికలుగా చూశారు. అందుకే కేంద్ర నాయకత్వం రావడం.. అన్ని ప్రాంతాల ప్రజలకు ఇది సురక్షిత నగరం అన్న ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. జనసేన శ్రేణులు 60 డివిజన్లలో పోటీ చేద్దామనుకున్న పరిస్థితుల్లో బీజేపీతో ఇక్కడ అవగాహనతో ముందుకు వెళ్తే మంచిది అనిపించింది. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకూడదు అన్న ఒక్క పిలుపు మేరకు 60 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బీజేపీ గెలుపులో జనసైనికులు వారికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి సహకరించినందుకు జనసేన శ్రేణులు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఈ సందర్భంగా పెద్దన్న లాంటి డాక్టర్ లక్ష్మణ్ గారికి శుభాకాంక్షలు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు అందరినీ సమాయత్తపరిచినందుకు ధన్యవాదాలు. టైగర్ సంజయ్ అనే స్థాయికి ఆయన ఎదిగారు. తిరుపతి ఎన్నికల్లో ఇరు పార్టీలు సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి అది ఇచ్చే నివేదిక మీద ముందుకు వెళ్తాం. తక్కువ సమయంలో పర్యటనకు ఏర్పాట్లు చేసిన నాలుగు జిల్లాల నాయకులకు ధన్యవాదాలు” అన్నారు.
హైవేలపైకి వచ్చి ఆవేదన చెప్పుకున్నారు : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “నివర్ తుపాన్ వల్ల రైతాంగం, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది మూడు ప్రకృతి విపత్తులు సంభవించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. నాలుగు జిల్లాల్లో పర్యటించి రైతులతో మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నుంచి ఎదురైన చేదు అనుభవాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 2వ తేదీన కృష్ణా జిల్లాలో మొదలైన ఈ పర్యటన గుంటూరు, చిత్తూరు జిల్లాల మీదగా ఇవాళ నెల్లూరుకు చేరుకుంది. ఈ పర్యటనలో చాలా మంది రైతులు తమ ఆవేదనను అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొచ్చారు. హైవేలపైకి వచ్చి వాళ్ల పడుతున్న కష్టాలను వివరించారు. నిన్న నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయినప్పుడు… ఇక్కడ పరిస్థితులను వాళ్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వెనకబడిపోయాయని, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయడంలో, ఫ్లడ్ మెనేజ్మెంట్ విషయంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందని వివరించారు. భారీ వర్షంలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పట్టిన ప్రతి ఒక్క జనసైనికుడికి, నాయకులకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన”ని అన్నారు. ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ ఆర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివ శంకర్ శ్రీ సత్య బొలిశెట్టి, పి.ఏ.సి సభ్యులు శ్రీ మనుక్రాంత్ రెడ్డి, డాక్టర్ పి. హరిప్రసాద్ పాల్గొన్నారు.