"ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలపై వరుస అత్యాచారాలకు కారణాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు" మన ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలకు కారణాలేంటి? అన్నెం పున్నెం ఎరుగని పసిపిల్లల నుండి మహిళల దాకా, మృగాళ్ల బారిన పడడానికి కారణాలేంటీ? ఈ అత్యాచార ఘటనలను అరికట్టలేమా? ఈ ఆకృత్యాలను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రభుత్వ చిత్తశుద్ది ఎంత ఉందో మనం ఒకసారి పున:పరిశీలన చేద్దాం.
చంద్రబాబు గారి పాలనలో జరిగిన "కాల్ మనీ, సెక్స్ రాకెట్" అఘాయిత్యాలతో విసిగి వేసారి ఉన్న ప్రజలు, మహిళలపై జరిగిన దాడులను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరి కూడా సరిగ్గా లేదనీ, వారికున్న బలమైన మీడియా వల్ల, ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు బయట ప్రపంచానికి తెలియకుండా మ్యానేజ్ చేస్తారని, సుగాలి ప్రీతి అనే చిన్న పిల్లపై జరిగిన క్రూరమైన ఉదంతంతో ఆంధ్రా ప్రజలకు తెలిసి వచ్చింది. అందుకే సమర్థుడు అనుకొన్న అసమర్థ చంద్రబాబు గారికి బై బై చెప్పి, పవన్ గారి ఉన్నత ఆశయాన్ని అర్థం చేసుకోలేక, తమ బతుకులు బుగ్గి చేసే మద్యాన్ని ఆంధ్రాలో నిషేదిస్తామని చెప్పిన జగన్ గారికి ఊరు వాడలో, పల్లె పల్లెల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు అఖండ విజయం అందించారు. హోమ్ మంత్రిగా శ్రీమతి సుచరిత గారు రావడంతో, మహిళలపై అఘాయిత్యాలు తగ్గుతాయని అనుకొన్న ప్రజలకు అది కేవలం భ్రమేనని తొందర్లోనే తెలిసి వచ్చింది. సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను కూడా జగన్ ప్రభుత్వం నిలబెట్టుకోలేక పోయింది. తాను చంద్రబాబు లాగానే, మహిళలపై జరిగిన, జరిగే అఘాయిత్యాలను చూసి చూడనట్లు ఊరుకుంటానని సుగాలి ప్రీతి కేసు మూడేళ్లుగా నాన్చుతున్న జగన్ గారి అసమర్థ ప్రభుత్వాన్ని చూస్తే చెప్పొచ్చు.
నిజం చెప్పాలంటే ఆడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, 2018తో పోల్చితే, 2019లో మన రాష్ట్రంలో, మహిళలపై అకృత్యాలు 7% పైగా పెరిగాయని, National Crimes Records Bueuro చెబుతోంది. అంటే జగన్ గారి ప్రభుత్వం మహిళల రక్షణ గురించి ఎలాంటి ప్రత్యేక శ్రద్ద తీసుకోలేదని తేల్చి చెబుతోంది. " నేనున్నా నేను విన్నా" అంటూ పెయిడ్ కార్యకర్తలతో ఒక ఊత పదం జనాల్లోకి వదిలి, "సంపూర్ణ మద్యపాన నిషేధం" చేస్తానని, తద్వారా అక్కచెళ్ళమ్మల ఇంట్లో ఆనందం చూపిస్తానని అన్నారు. అధికారంలోకి రాగానే, బెల్టు షాపులు మాత్రమే మూయించి, మద్యం అమ్మకాలు తమ చేతుల్లోకి తీసుకుని, పిచ్చి పిచ్చి బ్రాండ్లను ఆంధ్రా యావత్తూ అమల్లోకి తెచ్చి, తాను చెప్పేది వేరే, చేసేది వేరే అంటూ ఫక్తు రాజకీయ నాయకుడి అవలక్షణాన్ని రాష్ర్ట ప్రజలకు సిగ్గులేకుండా చూపించారు. రాష్ట్రంలో, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు గల ముఖ్య కారణం జగన్ ప్రభుత్వం. తన బినామీల ద్వారా అమ్ముతున్న బూమ్ బూమ్ లాంటి పిచ్చి బ్రాండ్ల వల్లనే అని భోగడ్తా! ఇలాంటి బ్రాండ్లు తాగి, ఆ మత్తులో కన్నూ మిన్నూ కానకుండా ఆడపిల్లలపై మందు రాయుళ్లు చేసే అత్యాచారాలకు జగన్ గారి ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత అని నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా కృష్ణా నది ఒడ్డున ఒక జంట మీద జరిగిన దాడి. ఆ దంపతులలో కాబోయే భర్తను దారుణంగా కొట్టి, మహిళపై మద్యం మత్తులో ఇద్దరు దుండగులు చేసిన అత్యాచార ఘటన. ఆ ఇద్దరిలో ఒక నిందితుడ్ని ఇప్పటిదాకా పట్టుకోలేక పోవడం జగన్ ప్రభుత్వ అసమర్ధతకు మచ్చుతునక.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, యావత్ భారత దేశాన్ని నిర్భయ ఘటన మాదిరిగానే జరిగిన "దిశ" ఘటన విస్మయ పరచింది. ఎన్కౌంటర్ ద్వారా తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూపించింది. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటన, తన సొంత సోదరికి జరిగినట్టుగా బిల్డప్ ఇచ్చి, చలించిపోయిన(ట్టు) సీయం జగన్ గారు, ఆవేశంతో, ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019' 'ఏపీ 'దిశ' యాక్ట్ పేరుతో అసెంబ్లీలో "దిశ" చట్టాన్ని తెచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొంది రెండేళ్లు కావస్తోంది. మరి ఎంతమందికి న్యాయం జరిగింది? దిశా చట్టంలో ఏం చెప్పారు?
"దిశా చట్టం" ఈ చట్టంలో అతి ముఖ్యమైన విషయం, "మహిళలపై లేదా ఆడపిల్లలపై అత్యాచార కేసుల్లో, నేరం జరిగినట్లు నిర్ధారించే ఖచ్చితమైన ఆధారాలు గనుక ఉంటే, రేపిస్టులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి" దిశ చట్టం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో ఇద్దరు మహిళా అధికారులను నియమించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్లను దిశ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని ఈ చట్టంలో ప్రతిపాదించారు. మహిళలకు సంబంధించిన దాడులు, వేధింపుల కేసుల్లో వారం రోజుల్లో పోలీసుల దర్యాప్తు, ఆ తర్వాతి 14 రోజుల్లో ప్రత్యేక కోర్టు విచారణ ముగించేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. అంటే, ఈ చట్టం ప్రకారం, అత్యాచార ఘటన జరిగిన 21 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. ఈ చట్టంలో లోపాలు ఉన్నాయని, తాము చేసే సూచనలు తప్పకుండా పాటించాలని కేంద్రం ఈ చట్టాన్ని తిరిగి రాష్ట్రానికే వెనక్కు పంపితే, జగన్ గారి ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోలేదు.
"దిశా చట్టం" చేశారు, ఆర్భాటంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు గానీ, పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఎంతమంది పోలీసులు ఉండాలి, మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండాలి, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఎన్ని నిధులు అందజేయాలి, పోలీస్ వ్యవస్ధను ఎలా ఆధునీకరణ చెయ్యాలి అన్న మాటలే మరిచిపోయారు. మన రాష్ట్రవ్యాప్తంగా దిశ చట్టం ఆమోదించిన తర్వాత, డిసెంబర్ 12, 2019 నుండి ఇప్పటి వరకూ వెయ్యికి పైగా లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. కానీ ఈ కేసుల్లో నిందితులకు గత చట్టాల ప్రకారమే శిక్షలు పడుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం మాత్రమే ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. ఈ ఘటనలో వీడియో సాక్ష్యాలతో సహా అన్ని ఆధారాలు ఉన్నా కూడా, ఆ వ్యక్తిపై కేసులో తీర్పు ఇవ్వడానికి పట్టిన కాలం ఒక సంవత్సరం. మహిళలపై జరిగే నేరాల్లో, ఆధారాలు ఉన్నా చట్టాల అమల్లో వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వెనుకబడి ఉన్నదో చెప్పడానికి ఇదే అతి పెద్ద ఉదాహరణ. చట్టాలు పక్కాగా అమలు చెయ్యాలి అంటే అందుకు తగ్గ పోలీసుల సంఖ్య కూడా ఉండాలనేది జగన్ గారికి తెలియని విషయమేమీ కాదు.
2020 అక్టోబర్ 21 న, పోలీస్ సంస్మరణ సభలో ప్రతీ ఏడాది ఆరువేల మంది పోలీసులను రిక్రూట్మెంట్ చేసి, పోలీసులపై పనిభారం తగ్గిస్తామని చెప్పిన సీయం జగన్, మూడేళ్లలో ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ప్రకటించకుండా అటు నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి రగిలించి, ఇటు శాంతి భద్రతలను పాటించే పోలీసులపై తీవ్ర పెనుభారం మోపారు. రోజుకొక ఘటన నుండి పూటకో అత్యాచార ఘటన వినాల్సిన దౌర్భాగ్యంలోకి ప్రజలను నెట్టేశారు. పోలీసుల వైఫల్యానికి ప్రధాన కారణం పాలకులే అనీ గట్టిగా చెప్పొచ్చు. మొన్న విజయవాడలో జరిగిన అత్యాచార ఘటన, రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగిన మరో సామూహిక అత్యాచార ఘటన ఇందుకు ఉదాహరణ. మతిస్థిమితం లేని తన కూతురు కనిపించడం లేదనీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఒక తండ్రిని ఎంత మాత్రమూ పట్టించుకోలేదు అక్కడి స్టేషన్ పోలీసులు. మానవ మృగాల కోరల్లో చిక్కిన ఆ కూతురును తండ్రే వెతికి పట్టుకొని కాపాడుకొని, మృగాడిని పోలీసులకు అప్పగించారు అంటే, ఎంత తీవ్రమైన నిర్లక్ష్యం, భాధ్యతా రాహిత్యం లోపోలీసు వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని అంతకన్నా ఎక్కువ భాద్యతారాహిత్యంతో మన మరో మహిళా హోమ్ మంత్రి వనిత గారు పబ్లిగ్గా శెలవియ్యడం, ఆంధ్రా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం! అత్యాచార భాదితులకు సుమారు 120 కోట్లు పరిహారం కింద చెల్లించామని హోమ్ మంత్రి గారు గొప్పగా చెప్పుకోవడం, మహిళా లోకానికి తీవ్ర అవమానం, దారుణాతి దారుణం! చేతగాని వైసీపీ ప్రభుత్వ పాలనలో, ఆంధ్రాలో రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాల కట్టడికి పోలీసు ఉన్నతాధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గౌరవ హైకోర్టు వారు, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను సుమోటోగా తీసుకోవాలనీ, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప సూచన ఇచ్చారు. మానవతా దృక్పథంతో ఈ సూచన అమలు చేస్తే, మహిళలపై జరిగే అత్యాచారాలు కొంతవరకైనా అరికట్టవచ్చు. మాజీ మంత్రి అవంతి నుండీ తాజా మంత్రి అంబటి వరకూ మహిళల పట్ల వారి నైజం సోషల్ మీడియాలో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఇలాటి వారికి ఉన్నత పదవులిచ్చి, వారికి పోలీసులను శాసించే స్థాయికి తెచ్చిన జగన్ గారి నాయకత్వంలో మహిళల కు రక్షణ దొరుకుతుంది అననుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే... పాలన మారాలి. "తప్పు చేస్తే తన తలైనా తెగి పడాలి" అనే పవన్ కల్యాణ్ గారి ధీరోదాత్త నాయకత్వం రావాలి. "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:'' అంటూ పద్యాల్లో మాత్రమే ఆడవారిని పూజించే రోజులు చుడాల్సి వస్తుంది. మృగాళ్ల చేతుల్లో బలైపోయిన సుగాలి ప్రీతి లాంటి ఆడపిల్లలకు న్యాయం చెయ్యాలి అంటూ దశాబ్దాల పాటు పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది.
#Written By
ట్విట్టర్ ఐడి : @MaheshJSP
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com